భర్తను హత్య చేసిన భార్య | Wife kills husband in Srikakulam district | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన భార్య

May 26 2026 5:55 AM | Updated on May 26 2026 5:55 AM

Wife kills husband in Srikakulam district

నాగమణి(ఫైల్‌)

తగరపువలస: భర్తను భార్య హతమార్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వలందపేట­లో జరిగింది. పోలీ­సులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి(26)కి వలందపేట రజక వీధికి చెందిన తాపీ మేస్త్రి బోర సూరితాత(35)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాగమణి నూడిల్స్‌ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆదివారం భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు..భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్‌ చేసింది.

అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో తానే చున్నీని బిగించి సూరితాతను హతమార్చానని ఒప్పుకుంది. ఈ హత్యలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement