శ్రీకాకుళం: జిల్లాకు చెందిన స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటికీ.. మైదానంలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) తరఫున విజయ్ వరుసగా రెండో ఏడాది ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఒకే ఒక్క ఛాన్స్..! అన్నట్టుగా ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యువ ఆల్‌రౌండర్.. అవకాశం లభించిన మ్యాచ్‌లో ఆకట్టుకునేందుకు నిరీక్షిస్తున్నాడు. డీసీ ఆడే తన తదుపరి మ్యాచ్‌లో అవకాశం లభించవచ్చని భావిస్తున్నాడు.
రూ.30 లక్షలకు కొనుగోలు..
పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతునప్పటికీ.. గత మూడేళ్లగా నిలకడైన ఆటతీరుతో ఆల్‌రౌండర్‌గా రాణింపుతో అందరి దృష్టిని ఆకర్షించిన త్రిపురాన విజయ్.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలక్షన్స్ ట్రయల్స్‌లో పాల్గొని రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయడం విజయ్‌లోని అదనపు క్వాలిటీ. వీటికి ముందు కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్‌లో ఛాన్స్ వచ్చింది. ఇటీవల ముగిసిన టోర్నీల్లో రాణించడంతో డీసీ విజయ్‌ను అట్టిపెట్టుకుంది.
నిరూపించుకుంటాడు: జెడ్‌సీఎస్
ఒక్క అవకాశం వస్తే.. విజయ్ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని జిల్లా క్రికెట్ సంఘం (జెడ్‌సీఎస్) ప్రతినిధులు, జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ రవికుమార్, కోచ్‌లు, సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు. విజయ్‌ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లు ఐపీఎల్ రేసులో నిలిచేందుకు ఉవి్వల్లూరుతున్నారని అంటున్నారు.
జిల్లా నుంచి ఒకే ఒక్కడు..
శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
నిరూపించుకుంటా..
ఐపీఎల్‌కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో ఏడాది ఆడుతుండటం, కేఎల్, అక్షర్, కుల్దీప్, వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి ట్రావెల్ చేస్తుండటం కొత్తగా ఉంది. ఐపీఎల్‌కు ఇప్పటి వరకు డీసీ 8 మ్యాచ్‌లు ఆడింది. ఫైనల్ లెవన్ ఛాన్స్ రాలేదు. డీసీ మ్యాచ్‌లు ఇంకా చాలా ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది. మున్ముందు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌బెంచ్‌లను కూడా పరీక్షించాలనే ఆలోచన మేనేజ్‌మెంట్, కోచ్‌లు ఆలోచన చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కఠోర సాధన చేస్తున్నాను. అవకాశం వచ్చిన మ్యాచ్‌ల్లో నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.
– త్రిపురాణ విజయ్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆంధ్రా రంజీ ఆటగాడు



