అది నరబలే.. | police chase the Mystery of Uppal's murder case | Sakshi
Sakshi News home page

అది నరబలే..

Feb 16 2018 1:47 AM | Updated on Jul 30 2018 9:16 PM

police chase the Mystery of  Uppal's murder case - Sakshi

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌. చిత్రంలో నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో చిక్కుముడి వీడింది. ఉప్పల్‌లోని చిలుకానగర్‌ ఇంటి యజమాని రాజశేఖర్, అతని భార్య శ్రీలత క్షుద్రపూజల పేరిట ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని రాచకొండ పోలీసులు తేల్చారు. నరబలి ఇస్తే శ్రీలత ఆరోగ్యం మెరుగు పడుతుందని ఓ కోయ దొర చెప్పిన మాటలతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. క్షుద్రపూజలు చేసిన గదిలో లభించిన రక్తపు మరకలు, శిశువు తల భాగం నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలతో సరిపోలడంతో ఈ కేసులో స్పష్టతకు వచ్చిన పోలీసులు.. రాజశేఖర్, అతని భార్య శ్రీలతను గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మీడియాకు తెలిపారు. 

కోయదొర చెప్పిన మాటలతో.. 
ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో తేరుకొండ రాజశేఖర్, శ్రీలత నివాసం ఉంటున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ భార్య శ్రీలత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎందరు వైద్యులను సంప్రదించినా మార్పురాలేదు. రెండేళ్ల క్రితం సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లిన రాజశేఖర్‌ దంపతులు అక్కడి ఓ కోయదొరను ఆశ్రయించారు. నరబలి ఇస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని అతడు తెలిపాడు. ఆ తర్వాత కూడా శ్రీలత ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో పలువురు మంత్రగాళ్లను ఆశ్రయించినా.. పరిస్థితి మెరుగు పడకపోవడంతో నరబలికి సిద్ధమయ్యారు. 

బోయిగూడలో శిశువు అపహరణ.. 
జనవరి 31న రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో బోయగూడలో రెక్కీ చేసిన రాజశేఖర్‌ మూడు నుంచి ఆరు నెలల వయసున్న ఆడ శిశువు విచక్షణాజ్ఞానం లేని తల్లిదండ్రుల వద్ద ఉన్నట్టు గుర్తించాడు. చంద్రగ్రహణం రోజున నరబలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఒకటో తేదీన  అర్ధరాత్రి 12.45 గంటలకు ఇంటి నుంచి కత్తి, పాలిథిన్‌ బ్యాగ్‌లను తీసుకుని ఏపీ20టీవీ1646 కారులో బయలుదేరి 1.30 గంటలకు బోయిగూడ చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై ఆదమరిచి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి పీర్జాదిగూడ ప్రతాపసింగారం మూసీ కాలువ వద్దకు రెండు గంటలకు తీసుకెళ్లి శిశువు గొంతు, మొండెంను కత్తితో నరికి వేరుచేశాడు. శిశువు మొండెం, కత్తిని మూసీలో పడేసి పాలిథిన్‌ కవర్‌లో తలను తీసుకుని తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి చేరుకున్నాడు.

నగ్నంగా భార్యాభర్తల క్షుద్రపూజలు
తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య శిశువు తలను పెట్టి భార్యాభర్తలిద్దరూ నగ్నంగా క్షుద్రపూజలు చేశారు. అనంతరం శిశువు తలకు సూర్యకిరణాలు పడేలా ఇంటిపై తలను ఉంచి కిందికి వచ్చారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రాజశేఖర్‌ క్యాబ్‌ను తీసుకుని మాదాపూర్‌కు బయలుదేరాడు. 10.20కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. రాజశేఖర్‌ అత్తమ్మ వీరకొండ బాలలక్ష్మి ఉదయం 11 గంటలకు బట్టలు ఆరేసేందుకు భవనంపైకి వెళ్లి శిశువు తలను చూసి కేకలు వేసింది. ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు తలను గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. రాజశేఖర్‌ ఇంట్లో దొరికిన రక్తనమూనాలు శిశువు డీఎన్‌ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన నివేదికతో రాజశేఖర్, శ్రీలతను పోలీసులు అరెస్టు చేశా రు.  క్షుద్రపూజలకు రాజశేఖర్‌ వాడిన వస్త్రాలను, దాచిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 
నరబలి జరిగిన పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే 2 వారాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 45 మందిని విచారించామని, ఆధారాల కోసం 112 ఫోన్‌కాల్స్, 54 సెల్‌ టవర్ల డేటాను సేకరించామని, 40 మంది సాక్షులను, వందకుపైగా సీసీ కెమెరా పుటే జీలను పరిశీలించామని, డీఎన్‌ఏ రిపోర్ట్‌ ద్వారా నరబలికి గురైంది ఆడ శిశువుగా గుర్తించామని, డీఎన్‌ఏ ఫలితాలతో నిందితులు దొరికిపోయారని సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. వీరిని విచారిస్తే ఈ కేసుపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement