భార్యాపిల్లలే నిందితులు

Murder Case Mystery Reveals PSR Nellore Police - Sakshi

శీనయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): వివాహేతర సంబధాలు ఏర్పరచుకుని భార్యను, కోడల్ని వేధించిన శీనయ్యను అతని భార్య, కుమారులే హత్య చేశారని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నరుకూరు సెంటర్‌ ఇందిరాకాలనీకి చెందిన ఐ.శీనయ్య (49), నాగమ్మలు దంపతులు. వారికి కుమార్, మరో కుమారుడు ఉన్నారు. శీనయ్య ఉప్పు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతను కొంతకాలంగా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. పలుమార్లు కుటుంబసభ్యులు పద్ధతి మార్చుకోవాలని సూచించినా ప్రవర్తనలో మార్పురాలేదు. భార్య గట్టిగా నిలదీయడంతో ఆమెను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన శీనయ్య తన భార్య వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తుండగా అతను హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హత్య చేశారని నాగమ్మ నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు లేదా మరెవరైనా చంపి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన నెల్లూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసులురెడ్డి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో భార్య, కుమారులు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో వారిపై అనుమానం రేగింది. దీంతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారు.

హత్య చేసిందిలా..
శీనయ్య కోడల్ని సైతం వేధించసాగాడు. ఈ విషయాన్ని నాగమ్మ సహించలేకపోయింది. భర్త వేధింపులు తాళలేని ఆమె జరిగిన విషయాలను తన కుమారులిద్దరికి చెప్పి ఎలాగైనా శీనయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే నవంబర్‌ 27వ తేదీన శీనయ్య ఇంటికి వచ్చి రాత్రి ఆరుబయట నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల అనంతరం భర్త ఆదమరిచి నిద్రిస్తుండడంతో నాగమ్మ తన ఇద్దరి పిల్లలతో కలిసి శీనయ్య ముఖంపై మరుగుదొడ్లను శుభ్రం చేసే యాసిడ్‌ పోశారు. అనంతరం రోకలిబండ, పచ్చడి నూరుకునే బండరాయితో అతడిపై విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారని డీఎస్పీ వెల్లడించారు. శీనయ్య హత్యను ఇతరుల మీద నెట్టేందుకు నిందితులు ప్రయత్నించారు. అందులో భాగంగా తన భర్తతో వివాహేతర సంబధం ఏర్పరచుకున్న వారు లేదా మరెవరైనా అతడిని హత్యచేసి ఉండొచ్చని నాగమ్మ ఫిర్యాదు ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసులురెడ్డి, ఎస్సై కె.నాగార్జునరెడ్డి, వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top