రక్షణ బలగంలో రాక్షసుడు | Minor Girl Molested by Army soldier | Sakshi
Sakshi News home page

రక్షణ బలగంలో రాక్షసుడు

Jul 26 2018 1:41 AM | Updated on Aug 28 2018 5:54 PM

Minor Girl Molested by Army soldier - Sakshi

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న అంజనీకుమార్‌. చిత్రంలో డీసీపీ సుమతి, ఏసీపీ రంగారావు, బ్రిజేశ్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలగిరిలోని నిర్మానుష్య ప్రాంతంలో తిష్టవేసి, ప్రేమ జంటలపై దాడులకు పాల్పడటమే కాకుండా యువతులపై అఘాయిత్యాలు చేస్తున్నది బిహార్‌కు చెందిన బ్రిజేశ్‌కుమార్‌ యాదవ్‌గా తేలింది. ప్రస్తుతం ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్న ఇతను.. గత డిసెంబర్‌లో ఆర్మీ మాజీ అధికారి కుమార్తె(మైనర్‌)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కేసులో పోలీసులకు చిక్కలేదు. సోమవారం ఓ యువతిపై అత్యాచారయత్నం చేస్తూ గస్తీ పోలీసులకు దొరికాడు. రెండు ఘటనల మధ్య ఉన్న సారూప్యతలతో పాటు డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి, బేగంపేట ఏసీపీ ఎస్‌.రంగారావులతో కలసి బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.  

ఏడాదిన్నరగా నగరంలో విధులు... 
బిహార్‌లోని రాణిపూర్‌కు చెందిన బ్రిజేశ్‌కుమార్‌ ఏడాదిన్నరగా సికింద్రాబాద్‌లోని 54 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ సిగ్నల్‌ రెజిమెంట్‌లో సిపాయిగా పని చేస్తున్నాడు. భార్య, కుమార్తెతో కలసి నేరేడ్‌మెట్‌ పరిధిలో నివసిస్తున్న ఇతను నిత్యం తిరుమలగిరి ఠాణా పరిధిలోని ఆమ్ముగూడ రైల్వే ట్రాక్‌ సమీపంలో తిష్ట వేస్తుండేవాడు. సమీపంలోని ఖో–ఇ–ఇమామ్‌ దర్గా చుట్టుపక్కలకు వచ్చే ప్రేమ జంటల్ని టార్గెట్‌ చేసేవాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వారి వద్దకు వెళ్లి యువకులపై దాడి చేసి, యువతులను భయపెట్టి అత్యాచారానికి ఒడిగట్టేవాడు. గత డిసెంబర్‌ 12న రాత్రి ఆ ప్రాంతంలో ఉన్న ఓ జంటపై దాడి చేశాడు. యువకుడిని తరిమేసి బాలికపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి ఆ దారి వెంట వెళ్తున్న వారు స్పృహతప్పి పడి ఉన్న బాలికను గుర్తించి వివరాలు ఆరా తీసి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఎన్ని కోణాల్లో ప్రయత్నించినా కేసు కొలిక్కి రాలేదు.  

మళ్లీ యత్నించి పట్టుబడ్డాడు... 
సోమవారం అదే ప్రాంతంలో బ్రిజేశ్‌ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఇంకో ప్రేమజంటను టార్గెట్‌గా చేశాడు. కార్ఖానాకు చెందిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో అక్కడకు రాగా వారిని అడ్డగించాడు. యువకుడిపై దాడి చేయడంతోపాటు యువతిని కొట్టి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆర్తనాదాలు చేసింది. ఇది విన్న తిరుమలగిరి ప్రాంత పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడకు వెళ్లి.. బ్రిజేశ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత డిసెంబర్‌ నాటి ఘటన అదే ప్రాంతంలో జరగడం, ఆ బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు ఇతడి ఆహార్యాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ నేరానికి ఇతడే బాధ్యుడని అనుమానించారు.  

పక్కా ఆధారాలతో నిర్ధారణ...  
గత డిసెంబర్‌లో, సోమవారం నేరాలు జరిగిన ప్రాంతంతోపాటు దాడి తీరు ఒకేలా ఉండటంతో ఆ కోణంలో పోలీసులు బ్రిజేశ్‌ను ప్రశ్నించారు. అయినా డిసెంబర్‌ నాటి నేరంతో తనకు సంబం«ధం లేదన్నాడు. దీంతో ఇతడి నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి ఫోరె న్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపించారు. ప్రత్యేక కేసు కావడంతో 24 గంటల్లోనే ప్రొఫైలింగ్‌ చేసిన నిపుణులు బాధితురాలి నుంచి సేకరించిన నమూనాలతో పోల్చి డిసెంబర్‌ నాటి అఘాయిత్యానికి బ్రిజేశే బాధ్యుడని నివేదిక ఇచ్చారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై ఆర్మీకి అధికారిక సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement