
కర్నూలు ,ఆత్మకూరు రూరల్: తెలిసీ తెలియని వయసులో ఏర్పడిన ఆకర్షణనే ప్రేమగా భావించి.. తమ తల్లిదండ్రులకు తెలిస్తే ఒప్పుకోరేమోనని భయపడిన ఓ 14 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు మండలం నూతనపల్లెకు చెందిన వెంకటేష్ గౌడ్ అనే తాపీ మేస్త్రీ వద్ద జయరాముడు పనిచేస్తుండేవాడు. వెంకటేష్ గౌడ్‌కు అనిత అనే కుమార్తె ఉంది. ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో అనిత, జయరాముడు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం వారు ఇంటి నుంచి వెళ్లిపోయారు.
దీంతో తల్లిదండ్రులు కర్నూలు 3వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. అనిత, జయరాముడు గురువారం ఆత్మకూరుకు చేరుకున్నారు. వారు స్థానిక వెంగళరెడ్డి నగర్ గుండా నడుచుకుంటూ.. కొత్తపల్లె రోడ్డులో ఉన్న వీఆర్‌ఎస్‌పీ శిథిల భవనాల వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ వీళ్లను చూసిన ఓ వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్.. అతనితో కలసి శిథిల భవనాల్లో వారి కోసం గాలించాడు. భవనం వెనక ఉన్న మరుగుదొడ్డి తలుపుకు వేలాడుతూ అనిత, జయరాముడు మృతదేహాలు కనిపించడంతో.. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.