పెళ్లికూతురు మెడలోంచి తాళి మాయం..! | Marriage In Thieves Nizamabad | Sakshi
Sakshi News home page

May 3 2018 9:38 AM | Updated on Oct 17 2018 6:10 PM

Marriage In Thieves Nizamabad - Sakshi

నిందితురాలు

నాగిరెడ్డిపేట్‌(ఎల్లారెడ్డి) : నిజామాబాదు జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డిలో జరిగిన వివాహ వేడుకలో ఏకంగా పెళ్లికూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కన్నారెడ్డికి చెందిన పేరుపల్లి బాల పోచయ్య బుధవారం తన కూతురి పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా ముగ్గురి మహిళలు పెళ్లి కుమారుని తరఫున బంధువుల మాదిరిగా వివాహ కార్యక్రమానికి హాజరై పెళ్లి కూతురు మెడలో పూల దండలను సర్దుతూ ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు.

కొద్దిసేపటికే మెడలో పుస్తెల తాడు లేకపోవడాన్ని గమనించిన పెళ్లి కూతురు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన పెళ్లి బృందం సభ్యులు పుస్తెల తాడు కోసం గాలించారు. కాగా పెళ్లి కూతురు మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించడాన్ని గమనించిన వారి బంధువు వెంటనే మిగతా వారిని అప్రమత్తం చేశారు. పెళ్లి కూతురు వద్ద తచ్చాడిన ముగ్గురు మహిళల గురించి ఆరా తీశారు. అదే సమయంలో ముగ్గురు మహిళలు కారులో ఎక్కి వెళ్లిపోతుండగా గ్రామస్తులు వెళ్లి వారిని అడ్డుకున్నారు.

దీంతో పాటు మహిళలను, కారులో సోదా చేయగా కారులోని మ్యాట్‌ కింద పుస్తెలతాడు కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి బృందం సభ్యులతోపాటు గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేసి నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. కారులో లభించిన పుస్తెల తాడును పోలీసులు పెళ్లి బృందం సభ్యులకు అప్పగించడంతో పెళ్లి తంతు యథావిధిగా కొనసాగింది. పెళ్లి కూతురి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1
1/1

కారులో లభించిన పుస్తెల తాడు

Advertisement
 
Advertisement
Advertisement