ఒక భర్త... నలుగురు భార్యలు | Man Married Four Women in Ten Years Tamil nadu | Sakshi
Sakshi News home page

రామనాథపురంలో నిత్యపెళ్లికొడుకు

Jul 27 2019 7:26 AM | Updated on Jul 27 2019 7:28 AM

Man Married Four Women in Ten Years Tamil nadu - Sakshi

నలుగురు భార్యలతో గంగనాథన్‌

పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: దుబాయ్‌లో ఉద్యోగం. చేతినిండా సంపాదన, చూడ్డానికి సినిమా స్టార్‌లా వేషధారణ, ముఖ కవళికలు. వరుడి వేటలో ఉన్న యువతికి ఇంతకంటే ఏమి కావాలి. వెంటనే పెళ్లి చేసుకుని వివరాలు చెప్పగానే భర్త ఒళ్లో వాలిపోదామని ఏ అమ్మాయికైనా అనిపించకమానదు. కోమలాదేవి, కవిత, యుమున, దీప అనే యువతులకు కూడా అలానే అనిపించింది. ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

రామనాథపురం జిల్లా ఆళకన్‌కుళానికి చెందిన కోమలాదేవి అనే బీకాం పట్టభద్రురాలు అదే ప్రాంతంలోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మాడకోట్టాన్‌ ప్రాంతానికి చెందిన గంగనాథన్‌ అనే వ్యక్తితో 2008లో కోమలాదేవికి పెళ్లిచూపులయ్యాయి. అబ్బాయి బాగున్నాడు, పైగా దుబాయ్‌లో ఉద్యోగం చెస్తున్నట్లు చెప్పడంతో మారుమాటడకుండా మనువాడింది. పెద్దలు సైతం జాంజాం అని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికాగానే కోమలాదేవిని దుబాయ్‌కి తీసుకెళ్లి కొత్తగా ఒక సంస్థను నెలకొల్పి బాగా సంపాదించాడు. అయితే గంగనాథన్‌ రాత్రివేళల్లో తరచూ బయటకు వెళ్లడంతో కోమలాదేవి తగవుపెట్టుకుంది. దీంతో మాయమాటలు చెప్పి కోమలాదేవిని ఇండియాకు తీసుకొచ్చి రామనాథపురంలో వదిలిపెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఒక్కడే దుబాయ్‌ వెళ్లిపోయి అప్పుడప్పుడూ భార్య వద్దకు వచ్చేవాడు. ఇలా ఒకసారి రామనాథపురం వచ్చినపుడు గంగనాథన్‌ సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చింది.

భర్త సెల్‌ఫోన్‌ నుంచి అ నంబరుకు కోమలాదేవీ ఫోన్‌ చేయగా గంగనాథన్‌కు చిన్నసేలంకు చెందిన కవిత అనే యువతితో రెండో వివాహమైందని, ఆమె గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని బిత్తరపోయింది. భర్తను నిలదీయగా కవిత ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. అయితే భర్త మాటలను నమ్మని కోమలాదేవి రహస్యంగా అతని సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి విచారణ జరిపి చెన్నైకి చెందిన యమున అనే యువతిని మూడో భార్యగా, దీప అనే మహిళను నాల్గో భార్యగా వివాహమాడినట్లు తెలుసుకుంది. ఒక్కో భార్యతో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలు, శృంగార వాట్సాప్‌ మెసేజ్‌లు చూసి లోలోన ఆగ్రహంతో ఊగిపోయింది. రేషన్‌కార్డులో భార్య కవిత, వారి కుమారుడు శ్రీధరన్‌ పేర్లను చేర్చాడు. ఇలా ఒక్కో భార్యతో వేర్వేరు విలాసాలు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ నకిలీ డాక్యుమెంట్లు పొందాడు. అన్ని మోసాలను తెలుసుకున్న కోమలాదేవి భర్తపై రామనాథపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. గంగనాథన్, కోమలాదేవీ దంపతులకు 10, 9 ఏళ్ల వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండోభార్య కవితకు శ్రీధరన్, మూడోభార్య యమునకు గిరిధరన్, నాల్గో భార్య దీపకు ఒక కుమార్తె ఉండడం గమనార్హం. పెళ్లి కోసం యువకుడిని వెతికే అమ్మాయి ఇంటి వారు అతని రూపురేఖలు, హోదా మాత్రమేగాక అతడి పూర్వాపరాలు తెలుసుకోకుంటే ముప్పు తప్పదని గంగనాథన్‌ సంఘటన చాటిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement