క్షణికావేశంలో భార్యపై గొడ్డలితో దాడి

Man Committed Suicide In Yadadri - Sakshi

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

భార్య పరిస్థితి విషమం

కేతేపల్లి మండలం తుంగతుర్తిలో ఘటన

కేతేపల్లి(నకిరేకల్‌)  నల్గోండ : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భర్త ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత తాను వ్యవసాయ బావి వద్ద విద్యుత్‌ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జటంగి భిక్షమయ్య–లింగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.

వీరిలో పెద్ద కుమారుడు జటంగి శ్రీనివాస్‌(33)కు సూర్యాపేట మండలం కాసరబాద్‌కు చెందిన రజితతో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తుంగతుర్తి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కూతురు నవ్య,  9 ఏళ్ల కుమారుడు కార్తీక్‌ సంతానం ఉన్నారు. వివాహం జరిగిన ఐదేళ్ల వరకు వీరి  కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో రజితను ఆమె భర్త తరుచూ వేధించసాగాడు.

ఈక్రమంలో పలుమార్లు ఇరువురు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగాయి. అయినా శ్రీనివాస్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఏడాది కిత్రం రజిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిగారి ఊరైన కాసరబాదుకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని పిల్లలను పోషించుకుటుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ వివాహేతర సంబంధం పేరుతో తాను వేధించనని, భార్య, పిల్లలతో కలసి ఉంటానని నాలుగు నెలల కిత్రం కాసరబాదుకు వెళ్లి  భార్య పిల్లలను తన ఇంటికి తీసుకువచ్చాడు.

అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. వివాహేతర సంబంధం పేరుతో మళ్లీ వేధించసాగాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఇరువురి మద్య ఏం జరిగిందో ఏమో కానీ శ్రీనివాస్‌ తన భార్య రజిత కాళ్లు, చేతులపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న రజితను చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మనస్తాపానికి గురైన భర్త..

భార్యపై దాడి చేసిన శ్రీనివాస్‌ మనస్తాపానికి గురై తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చేతికందే ఎత్తులో కిందకు వేళాడుతున్న 11కేవీ విద్యుత్‌ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విద్యుదాఘాతానికి లోనయిన శ్రీనివాస్‌ పొలంలో ఉన్న బురదలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన చుట్టు పక్కల రైతులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందాడు. పొలం బురదలో పడి ఉన్న శ్రీనివాస్‌ మృతదేహాన్ని అతికష్టం మీద గ్రామస్తులు ఒడ్డుకు చేర్చారు.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ

సమాచారం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ కాస్ట్రోరెడ్డి, కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్‌రెడ్డి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన శ్రీనివాస్‌ చిన్న సోదరుడు నాగయ్య సైతం భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నాగయ్యను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top