సినిమాను తలదన్నే.. లవ్‌ క్రైం స్టోరీ..! | Gujarat Police Arrest Woman Who Committed Suicide 14 Years Ago | Sakshi
Sakshi News home page

వివాహం అనంతరం ప్రేమ... ఆపై..

Jul 23 2019 8:08 PM | Updated on Jul 23 2019 8:37 PM

Gujarat Police Arrest Woman Who Committed Suicide 14 Years Ago - Sakshi

గాంధీనగర్‌: భర్తను చంపి.. అతడి స్థానంలో ప్రేమించిన వ్యక్తిని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన ఓ వివాహిత కథ కొన్నాళ్ల క్రితం చూశాం. ఇప్పుడు మీరు తెలసుకోబోయేది కూడా అలాంటి కథే. కాకపోతే.. ఇక్కడ ప్రియుడితో కలిసి ఉండేందుకు తానే చనిపోయినట్లు నాటకమాడి.. 14 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిందో మహిళ. వివరాలు.. పటాన్‌ పట్టణం బల్వాజ్‌ గ్రామానికి చెందిన భిఖీబెన్‌కు 17 సంవత్సరాల క్రితం ప్రకాశ్‌ పంచల్‌తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు. కానీ కొద్ది రోజుల తర్వాత భిఖీబెన్‌ అదే గ్రామానికి చెందిన విజుభా రాథోడ్‌తో ప్రేమలో పడింది. అయితే భర్త నుంచి విడిపోయి.. విజుభాతో కలిసి ఉండటం అంత తేలిక కాదని గ్రహించింది. దాంతో ప్రియుడితో కలిసి ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది భిఖీబెన్‌.

దానిలో భాగంగా ఓ రోజు భిఖీబెన్‌ చిన్న విషయానికే భర్తతో గొడవపడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అర్థరాత్రి గడిచాక విజుభాతో కలిసి ఊరు విడిచి వెళ్లి పోయింది. ఉదయం భిఖీబెన్‌ గదిలోకి వెళ్లి చూడగా ఆమె కనిపించలేదు. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం శూన్యం. దాంతో భిఖీబెన్‌ ఏ నదిలోనో దూకి చనిపోయిందని అందరూ భావించారు. పోలీసులు కూడా కేసు క్లోజ్‌ చేశారు. ఇది 14 ఏళ్ల క్రితం జరిగింది. కానీ అనూహ్యంగా భిఖీబెన్‌, ఆమె ప్రియుడు పోలీసులకు చిక్కారు. అంతేకాక ఓ మహిళను చంపిన కేసులో ప్రస్తుతం వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.

కథ నడిపించిందిలా..
ఇంటి నుంచి పారిపోయిన భిఖీబెన్‌ తాను చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించడం కోసం ప్రియుడితో కలిసి మతి స్థిమితం లేని ఓ మహిళను కిడ్నాప్‌ చేసి, చంపేసింది. తర్వాత మృత దేహానికి తన బట్టలు తొడిగి.. ముఖాన్ని గుర్తుపట్టరాకుండా కాల్చేపడేశారు. ఆ తర్వాత భిఖీబెన్‌ తన ప్రియుడితో కలిసి మెహ్సనాలో కాపురం పెట్టింది. ఈ క్రమంలో తన గుర్తింపును కూడా మార్చుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం భిఖీబెన్‌ గ్రామస్తుడొకరు మెహ్సనా వెళ్లడంతో ఈ నాటకమంతా వెలుగుచూసింది. అక్కడ భిఖీబెన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. పూర్తి వివరాలు ఆరా తీశాడు. విజుభాను వివాహం చేసుకుందని నిర్ధారించుకున్నాడు. ప్రియునితో కలిసి ఉండటానికి భిఖీబెన్‌ ఆడిన డ్రామాలను ఆమె భర్త ప్రకాశ్‌కు చెప్పాడు. ప్రకాశ్‌ ఫిర్యాదుతో భిఖీబెన్‌ను, ఆమె ప్రియుడు విజుభాను... వారికి సహకరించిన మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలన్ని వెల్లడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement