
చికిత్స పొందుతున్న బంగి అనంతయ్య
కర్నూలు: ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ చంద్రబాబు ఆశీస్సుల కోసం శ్రమించిన ఆ పార్టీ నేత బంగి అనంతయ్య.. చంద్రబాబు వల్ల తీవ్రంగా నష్టపోయానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నారు. అయితే అదే సమయానికి కుటుంబ సభ్యులు రావడంతో ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నమ్మించి మోసం చేశారంటూ సూసైడ్ నోట్
చంద్రబాబు కారణంగా తాను ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయానని, ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా తన ఎదుగుదలను దెబ్బతీశారంటూ సూసైడ్ నోట్‌లో రాశారు.
చంద్రబాబుకు వీరాభిమాని..
బంగి అనంతయ్య చంద్రబాబుకు వీరాభిమాని. 1995 నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ టీడీపీ అధినేత ఆశీస్సుల కోసం ప్రయత్నించేవారు. ఈ క్రమంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. కర్నూలు బుధవారపేటలో నివాసముంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నంపై కర్నూలు మూడో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. అనంతయ్యపై కేసు నమోదు చేశారు.