kurnool govt hospital
-
నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్
కర్నూలు (హాస్పిటల్) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన.. ప్రకృతి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్రెజర్ స్వింగ్ అడ్జార్పషన్(పీఎస్ఏ) ప్లాంట్ ట్రయల్ రన్‌ను సోమవారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇది ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ట్రయల్ రన్ వారం పాటు కొనసాగించి.. లోటు పాట్లు గమనించాక పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి ప్లాంట్‌నే ఈ ఆస్పత్రిలో సినీ నటుడు సోనూసూద్ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం దాదాపు వెయ్యి మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, వారికి ఆక్సిజన్ కొరత రాకుండా వార్ రూమ్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ విరాళం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో హఫీజ్‌ఖాన్ కరోనా బాధితుల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. యూఎంఎంసీ ఆస్పత్రి(హోస్టన్–అమెరికా), హఫీజ్‌ఖాన్ ట్రస్ట్ సంయుక్తంగా వీటిని సమకూర్చాయి. పెద్దాస్పత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో వంద పడకలతో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. అక్కడ 100 కాన్సన్ట్రేటర్లను వినియోగిస్తారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల కోసం మిగిలిన వాటిని వినియోగిస్తారు. -
ప్రకృతి నుంచే ఆక్సిజన్ ఉత్పత్తి
కర్నూలు (హాస్పిటల్): కోవిడ్ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి 10 నుంచి 50 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను కృత్రిమంగా అందించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాస్పత్రి)లో కోవిడ్ బాధితులకు పుష్కలంగా ఆక్సిజన్ అందించగలుగుతున్నారు. ఇప్పటికే ఇక్కడ లిండే గ్రూప్ భారత్ సంస్థ నిర్వహణలో రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. వీటిద్వారా రోజూ 23 టన్నుల ఆక్సిజన్‌ను నిల్వ చేసుకుని రోగులకు అందించే అవకాశం ఉంది. ఈ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుల కోసం 303 ఐసీయూ, 712 ఆక్సిజన్, 200కు పైగా సాధారణ బెడ్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం 171 ఐసీయూ, 644 ఆక్సిజన్ బెడ్లపై కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో గత సంవత్సరమే ఆస్పత్రిలో దాదాపు అన్ని పడకలకు ఆక్సిజన్ పైప్‌లైన్‌ను అనుసంధానించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చికిత్స అందించగలుగుతున్నారు. ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి పీఎం కేర్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 కోట్లకు పైగా వెచ్చించి ఇక్కడ ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ప్లాంట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇది ప్రకృతి సిద్ధంగా రోజుకు రెండు టన్నుల ప్రాణవాయువు ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి ప్లాంట్లు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో మాత్రమే ఏర్పాటయ్యాయి. కర్నూలు ప్లాంట్‌ను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్జికల్ బ్లాక్‌లోని 110 పడకలకు ఈ ప్లాంట్ నుంచి నేరుగా ఆక్సిజన్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తారు. ప్రభుత్వ ముందుచూపే కారణం కరోనా బాధితులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కర్నూలు పెద్దాస్పత్రిలోని దాదాపు అన్ని పడకలకు ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయించింది. అప్పటికే ఉన్న ప్లాంట్లకు అదనంగా మరొకటి ఏర్పాటు చేయడంతో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత అనే మాటే రాదు. – డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్, కర్నూలు -
Home Isolation: హోం ఐసొలేషన్‌లోనే లక్ష మందికి పైగా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీళ్లందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు 104 కాల్‌సెంటర్ వైద్యులు కూడా ఫోన్ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 9,937 మంది బాధితులు కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతమున్న 1.50 లక్షల యాక్టివ్ కేసుల్లో 37,760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే.. ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కోవిడ్ కేర్ సెంటర్‌కు రావాలని సూచిస్తున్నారు. మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కోవిడ్ చికిత్స అందిస్తుండగా.. 44,559 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆయాసం ఎక్కువ ఉంటేనే ఆస్పత్రులకు.. సాధారణ మందులు వాడి చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోవద్దు. ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లండి. –డా.సి.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
చంద్రబాబు వల్ల అన్ని రకాలుగా నష్టపోయా..
కర్నూలు: ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ చంద్రబాబు ఆశీస్సుల కోసం శ్రమించిన ఆ పార్టీ నేత బంగి అనంతయ్య.. చంద్రబాబు వల్ల తీవ్రంగా నష్టపోయానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నారు. అయితే అదే సమయానికి కుటుంబ సభ్యులు రావడంతో ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నమ్మించి మోసం చేశారంటూ సూసైడ్ నోట్ చంద్రబాబు కారణంగా తాను ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయానని, ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా తన ఎదుగుదలను దెబ్బతీశారంటూ సూసైడ్ నోట్లో రాశారు. చంద్రబాబుకు వీరాభిమాని.. బంగి అనంతయ్య చంద్రబాబుకు వీరాభిమాని. 1995 నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ టీడీపీ అధినేత ఆశీస్సుల కోసం ప్రయత్నించేవారు. ఈ క్రమంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. కర్నూలు బుధవారపేటలో నివాసముంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నంపై కర్నూలు మూడో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. అనంతయ్యపై కేసు నమోదు చేశారు. -
అక్కరకు రాని ఔషధాలు
కర్నూలు(హాస్పిటల్): ఔషధాలు అక్కరకు రాకుండా పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా రూ.4 కోట్ల విలువైన మందులు కాలం తీరిపోయి (ఎక్స్పైరీ) వృథాగా పడివున్నాయి. వీటిని కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో గుట్టలుగుట్టలుగా పడేశారు. ప్రభుత్వ అడ్డగోలుతనం, ఉన్నతాధికారుల కమీషన్ల వ్యవహారానికి ఇవి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి నాలుగేళ్లుగా డిమాండ్‌కు మించి పంపుతుండడం, ఇదే తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులు డిమాండ్‌కు మించి తీసుకోలేకపోతుండడంతో మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో పేరుకుపోయాయి. కాలం తీరిన వీటిని నాశనం చేసేందుకు అధికారులు ఇప్పుడు ఓ కమిటీ వేయడం గమనార్హం. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, ఆదోనిలో ఎంసీహెచ్ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రితో పాటు 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 40కి పైగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఏటా కర్నూలు సర్వజన వైద్యశాలకు ఒక్క దానికే రూ.4 కోట్లు, మిగిలిన ఆసుపత్రులకు రూ.4 కోట్ల విలువైన మందులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా మందులు, సర్జికల్స్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు పంపిస్తోంది. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక వాహనంలో తరలిస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దుర్వినియోగం చేస్తున్నారంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ–ఔషధి విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, సర్జికల్స్ ఇండెంట్‌ను వారు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రభుత్వానికి పెడుతూ ఉండాలి. ఆయా ఆసుపత్రుల డిమాండ్‌ను బట్టి మందులను కేటాయిస్తూ ఉంటారు. ఏ ఆసుపత్రికి ఎంత డిమాండ్ ఉందనే విషయం ఉన్నతాధికారులకు తప్ప సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు కూడా సరైన సమాచారం ఉండదు. ఈ మేరకు రాజధాని ప్రాంతం నుంచే మందులను ఉన్నతాధికారులు కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అవసరానికి మించి కొనుగోలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక 2014లో మూడు నెలల ఇండెంట్‌కు బదులు తొమ్మిది నెలల మందులను ఒకేసారి పంపించారు. అప్పటి నుంచి అధిక శాతం మందులను కొనుగోలు చేసి పంపిస్తూనే ఉన్నారు. వీటిని పెట్టేందుకు అవసరమైన స్థలం లేక ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ కార్యాలయంలోని అధికారుల గదుల్లోనూ ఉంచారు. ఇటీవల ఎన్ఎస్, ఆర్సీ సెలైన్ బాటిళ్లు జిల్లాకు మూడు నెలలకు సంబంధించి 34,000 డిమాండ్ ఉండగా.. ప్రభుత్వం ఏకంగా లక్షకు పైగా పంపింది. ఇలా వచ్చిన మందుల్లో అధిక శాతం కాలపరిమితికి దగ్గరగా ఉన్నవే కావడం గమనార్హం. కాలపరిమితి తీరిన మందుల విలువ రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నాలుగేళ్లుగా కమీషన్లకు ఆశపడుతూ కొనుగోలు చేసిన మందుల్లో అధిక శాతం వినియోగం కాకపోవడంతో కాలం తీరిపోయాయి. ఇందులో బి.కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, డైక్లోఫెనాక్, పారాసిటమాల్, సీపీఎం, ప్యాంటిడిన్, పాంటాప్రోజోల్ లాంటి 120 రకాల నిత్యావసర మందులూ ఉన్నాయి. ప్రస్తుతం ఇవే మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రంగా ఉండటం గమనార్హం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. వెంటనే ఆ మందులను నాశనం చేయాలని జిల్లా అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో మందులను ఎలా నాశనం చేయాలనే విషయమై కమిటీ వేశారు. ఇకపోతే పీహెచ్‌సీలకు పంపిన మందుల్లో కాలపరిమితి తీరిన వాటిని అక్కడే నాశనం చేస్తున్నారు. మందులను నాశనం చేసేందుకు కమిటీ కొన్నేళ్లుగా కాలపరిమితి తీరిన మందులు సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటిని నాశనం చేసేందుకు నాతో పాటు డీఎంహెచ్‌వో, ప్రభుత్వ ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో, నంద్యాల డీసీహెచ్‌లతో కమిటీ వేశాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం పంపించాం. –విజయభాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ -
నారాయణ రెడ్డి మృతదేహానికి రేపు పోస్టుమార్టం
కర్నూలు: ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురైన పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో పోస్టుమార్టం నిర్వహించలేదు. రేపు(సోమవారం) పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నారాయణ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆడ శిశువును చెట్ల పొద్దలో పడేసి..
-
కర్నూలులో దారుణం
కర్నూలు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువు కాళ్లు, చేతులు విరిచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో పడేసి పారిపోయారు. ప్రాణంతో ఉన్న ఆ శిశువును గమనించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది శిశు సంజీవని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో వ్యక్తి మృతి
కర్నూలు(తుగ్గలి): తుగ్గలి మండలం రాసన గ్రామంలో మంగళవారం రాత్రి గుండెపోటుతో కంసలి వీరాంజనేయులు(55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉండగా హఠాత్తుగా వీరాంజనేయులకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. -
ఆహారం వికటించి 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వసతి గృహంలో ఆహారం వికటించి 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం విద్యార్థులకు పులగం, చట్నీ వడ్డించారు. అనంతరం విద్యార్థులకు వాంతులు, కడుపులో నొప్పి, జ్వరంతో అస్వస్థత పాలయ్యారు. అందులో ఒక విద్యార్థికి రాత్రయ్యే సరికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావడంతో కర్నూలుకు తరలించారు.