ప్రకృతి నుంచే ఆక్సిజన్‌ ఉత్పత్తి

Oxygen production from nature - Sakshi

కర్నూలు పెద్దాస్పత్రిలో పుష్కలంగా ప్రాణవాయువు

రెండు ప్లాంట్ల ద్వారా నిత్యం 23 టన్నుల ఉత్పత్తి

ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే మరో పీఎస్‌ఏ ట్యాంక్‌ సిద్ధం

కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి 10 నుంచి 50 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను కృత్రిమంగా అందించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాస్పత్రి)లో కోవిడ్‌ బాధితులకు పుష్కలంగా ఆక్సిజన్‌ అందించగలుగుతున్నారు. ఇప్పటికే ఇక్కడ లిండే గ్రూప్‌ భారత్‌ సంస్థ నిర్వహణలో రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు పని చేస్తున్నాయి. వీటిద్వారా రోజూ 23 టన్నుల ఆక్సిజన్‌ను నిల్వ చేసుకుని రోగులకు అందించే అవకాశం ఉంది. ఈ ఆస్పత్రిలో కోవిడ్‌ బాధితుల కోసం 303 ఐసీయూ, 712 ఆక్సిజన్, 200కు పైగా సాధారణ బెడ్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం 171 ఐసీయూ, 644 ఆక్సిజన్‌ బెడ్లపై కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో గత సంవత్సరమే ఆస్పత్రిలో దాదాపు అన్ని పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ను అనుసంధానించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్‌ సమస్య తలెత్తకుండా చికిత్స అందించగలుగుతున్నారు. 

ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి
పీఎం కేర్‌ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 కోట్లకు పైగా వెచ్చించి ఇక్కడ ప్రెజర్‌ స్వింగ్‌  అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నారు. జనవరిలో ప్రారంభమైన ప్లాంట్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇది ప్రకృతి సిద్ధంగా రోజుకు రెండు టన్నుల ప్రాణవాయువు ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి ప్లాంట్లు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో మాత్రమే ఏర్పాటయ్యాయి. కర్నూలు ప్లాంట్‌ను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్జికల్‌ బ్లాక్‌లోని 110 పడకలకు ఈ ప్లాంట్‌ నుంచి నేరుగా ఆక్సిజన్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తారు.

ప్రభుత్వ ముందుచూపే కారణం
కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అత్యవసరంగా మారింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కర్నూలు పెద్దాస్పత్రిలోని దాదాపు అన్ని పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయించింది. అప్పటికే ఉన్న ప్లాంట్లకు అదనంగా మరొకటి ఏర్పాటు చేయడంతో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత అనే మాటే రాదు.
– డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్, కర్నూలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top