
టెలివిజన్ నటిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాస్మెటిక్ సర్జన్‌కు ముంబై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది
ముంబై : ఈ ఏడాది ఆగస్ట్‌లో టీవీ నటిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ విరాల్ దేశాయ్‌కు ముందస్తు బెయిల్ లభించింది. దేశాయ్‌కు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు ఆగస్ట్ 9న తన క్లినిక్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో దేశాయ్‌పై ముంబై పోలీసులు లైంగిక దాడి కేసు నమోదు చేశారు. కాగా బాధితురాలు, తాను పరస్పర అంగీకారంతో సంబంధం నెరుపుతున్నామని, ఆమె ఉద్దేశపూర్వకంగానే తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని దేశాయ్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా తాము సన్నిహితంగా ఉంటున్నామని చెబుతూ అందుకు సాక్ష్యంగా ఫోటోలు, వాట్సాప్ ఛాట్స్‌ను చూపారు. లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు చేసిన అనంతరం కూడా బాధితురాలు తనతో డిన్నర్‌కు వచ్చారని, నిత్యం వాట్సాప్‌లో టచ్‌లో ఉన్నట్టు దేశాయ్ కోర్టుకు నివేదించారు. నిందితుడు, ఆయన న్యాయవాది వాదనలు విన్నమీదట అడిషనల్ సెషన్స్ జడ్జి కల్పనా ఎస్ హోర్ విరాల్ దేశాయ్‌కు బెయిల్ మంజూరు చేశారు.