అమ్మ గోరుముద్దలే ఆఖరు.. | Baby Boy Falling From Third Floor Balcony And Assassinate | Sakshi
Sakshi News home page

అమ్మ గోరుముద్దలే ఆఖరు..

Mar 10 2020 9:22 AM | Updated on Mar 10 2020 9:22 AM

Baby Boy Falling From Third Floor Balcony And Assassinate - Sakshi

కుత్బుల్లాపూర్‌: ఆప్యాయంగా అమ్మ తినిపించిన గోరుముద్దలే ఆ చిన్నారికి చివరివి అయ్యాయి. తల్లితో ప్రేమగా మాట్లాడిన మాటలే కడసారి పలకరింపులయ్యాయి. హోలీ పండగ కోసం మేనమామ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాబుకు నూరేళ్లూ నిండాయి. అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులోనిబాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన ఘటన పేట్‌బషీరాబాద్‌పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన బాలుడు అసువులు బాయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. చేయి కడుక్కుని, గ్లాస్‌లో నీళ్లు తెచ్చేలోపు కుమారుడు మేడపై నుంచి పడి మృత్యు ఒడిలోకి చేరడంతో పండగ రోజు ఆ కుటుంబం విషాదంలో మునిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన నితిన్‌ రెడ్డి, శ్రావ్య దంపతులు.

వీరికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీహన్‌రెడ్డి (6) ఉన్నాడు. వీరు దుబాయ్‌లో ఉంటున్నారు. కుమారుడికి మాటలు సరిగా రాకపోవడంతో సర్జరీ నిమిత్తం కుమారుడిని  తీసుకొని ఆరు నెలల క్రితం శ్రావ్య నగర శివారు ప్రాంతంలోని కోణార్క్‌ ఆస్పత్రి పైప్‌లైన్‌ రోడ్డు సమీపంలోని లక్ష్మీగంగా ఎంక్లేవ్‌కు వచ్చి ఉంటున్నారు. కుమారుడు Ôశ్రీహన్‌రెడ్డి ప్లేస్కూల్‌లో చదువుతున్నాడు. ఉద్యోగరీత్యా నితిన్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో హోలీ పండగ కోసం జీడిమెట్లలోని భీమ్‌ప్రైడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సోదరుడి ఇంటికి శ్రావ్య తన కుమారుడు శ్రీహన్‌రెడ్డిని తీసుకొని ఆదివారం రాత్రి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాలుడికి అన్నం తినిపించారు. చేయి శుభ్రం చేసుకుని, గ్లాస్‌లో తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లారు. ఈ సమయంలో బాల్కనీలో ర్యాలింగ్‌ ఎక్కిన శ్రీహన్‌రెడ్డి అదుపుతప్పి మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి..
కుత్బుల్లాపూర్‌: డిగ్రీ చదువుతున్న విద్యార్థి బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్‌  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్సీఎల్‌ గోదావరి హోమ్స్‌లో ఉంటున్న నాగరాజు రెండో కుమారుడు సుబ్రహ్మణ్యం (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడుతూ ఐదో అంతస్తుకు వెళ్లాడు. అనుమానాస్పదస్థితిలో కిందపడ్డాడు. వెంటనే గుర్తించి సూరారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement