పక్కచూపుల నిఘా కన్ను 

ACB Raids On Transco Vigilance Additional SP Tangella Harikrishna House - Sakshi

ఎస్‌ఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగి...

అక్రమార్జనలోకూరుకుపోయిన హరికృష్ణ  

ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 

మార్కెట్‌లో రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తుల గుర్తింపు

కీలక డాక్యుమెంట్లు, 260 గ్రాముల బంగారం, 2.87 కిలోల వెండి స్వాదీనం  

వివరాలు వెల్లడించిన ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి 

ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అదనపు ఎస్పీ తంగెళ్ల హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో విశాఖలోని ఆశీలుమెట్ట దరి ఫేమ్‌ హైట్‌లోని ఐదో అంతస్తులో గల హరికృష్ణ నివాసంతోపాటు, రాజమండ్రి, హైదరాబాద్, అమలాపురం, విజయవాడలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ బీవీఎస్‌ రమణమూర్తి మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో విజిలెన్స్‌ ఏఎస్పీ హరికృష్ణ ఇంటిలో సోదాలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.74 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించామని, మార్కెట్‌ ధర ప్రకారం రూ.10కోట్ల పైనే ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన హరికృష్ణ 1989లో పోలీస్‌ శాఖలో ఎస్‌ఐగా చేరి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల్లో పనిచేశారన్నారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌లో అదనపు ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేసి నాలుగు నెలల కిందట విశాఖలోని ఏపీ ట్రాన్స్‌కోలో విజిలెన్స్‌ ఏఎస్పీగా చేరారని తెలిపారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. విజయనగరం డీఎస్పీ డి.వి.ఎస్‌.నాగేశ్వరరావు, సీఐలు అప్పారావు, భాస్కర్, ఎస్‌ఐలు, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలతో పోలీస్‌ శాఖతోపాటు ఏపీఈపీడీసీఎల్‌లో చర్చనీయంగా మారింది. హరికృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. 

గుర్తించిన ఆస్తులివీ 
హరికృష్ణ పేరు మీద తూర్పు గోదావరి జిల్లా, తాళ్లరేవు మండలం, చోల్లంగి గ్రామంలో 300 చదరపు గజాల ఇంటి స్థలం. 
విజయవాడలోని గుణదల జయప్రకాష్‌నగర్‌లో శ్రీలక్ష్మి అపార్టుమెంట్‌ సి – 4లో ఓ ప్లాట్‌.  
హరికృష్ణ భార్య తంగెళ్ల పద్మారాణి పేరు మీద పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, మట్టపర్రు గ్రామంలో 25 సెంట్లు స్థలం. 
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో 3.02 ఎకరాల స్థలం. 
కృష్ణ జిల్లా, మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో 72 సెంట్ల స్థలం. 
పశ్చిమ గోదావరి జిల్లా, గవరవరం గ్రామంలో అక్షయ ఎన్‌క్లేవ్‌లో ఓ ప్లాట్‌.
విశాఖపట్నం జిల్లా, పరదేశిపాలెంలో ఓ ప్లాట్‌. 
హరికృష్ణ కుమారుడు రాజహర్ష పేరు మీద విశాఖ జిల్లా పరదేశిపాలెంలో ఓ ప్లాట్‌.  
కుమార్తె మానవిత పేరు మీద హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో బిజాయ్‌ క్యాస్టిల్‌లో మూడో అంతస్తులో ఓ ప్లాట్‌. 
సుమారు 6.64 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారం, 2876 గ్రాముల వెండి వస్తువులు, రూ.19లక్షల విలువ చేసే ఇతర విలువైన వస్తువులను గుర్తించారు.  
అదేవిధంగా బ్యాంకు ఖాతాలో రూ.17లక్షల నగదు గుర్తించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top