ఏసీబీకి చిక్కిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

ACB Officials Arrested Food Inspector - Sakshi

ఆఫీస్‌ అసిస్టెంట్‌ అప్పారావు, కాంట్రాక్ట్‌ ఉద్యోగి రాజేష్‌ కూడా..

కిరాణా వ్యాపారి వద్ద రూ.10వేలు తీసుకుంటూ బుక్కయ్యారు

విశాఖ క్రైం : మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. చిరు వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ పెదవాల్తేరులోని ఆహారభద్రత, ప్రమాణాల అమలు శాఖ సహాయ ఆహార నియంత్రణ, అధీకృత అధికారి కార్యాలయంలో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వీరభధ్రరావు రెడ్‌హ్యాండ్‌గా పట్టుబడ్డాడు. అతనితోపాటు ఆఫీస్‌ అసిస్టెంట్‌ అప్పారావు, వీరు సొంతంగా నియమించుకున్న రాజేష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... చేపలుప్పాడ పంచాయతీ పుక్కాలపాలేనికి చెందిన పి.కనకరాజు చిన్న కిరాణా వ్యాపారం చేసుకుంటున్నాడు. గత ఫిబ్రవరి 15వ తేదీన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వీరభద్రరావు కిరాణా షాపులో తనిఖీలు చేశారు.

పెసరపప్పు కల్తీ ఉందని కేసు నమోదు చేశారు. మార్చి 16వ తేదీన అదే గ్రామంలోని వెంకటసాయి, ఆశీర్వాద్‌ షాపులో తనిఖీలు చేశారు. వెంకటసాయి షాపు యాజమానిని రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేయగా.. అతడు రూ. 6,500 సమర్పించుకున్నాడు. ఆశీర్వాద్‌ షాపు యాజమానిని రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేసి రూ. 3,500 తీసుకున్నాడు. ఇదే సమయంలో పి.కనకరాజును వి.వీరభధ్రరావు కలిసి పప్పులో కల్తీ ఉందని కెమికల్‌ రిపోర్టులో నిర్థారణ అయ్యిందని, ఇప్పటికే వచ్చిన నోటీసులతో ఏప్రిల్‌ 16న నగరంలోని కార్యాలయానికి రావాలని చెప్పాడు. కనకరాజు సోమవారం కార్యాలయానికి వెళ్లగా దీనిపై అప్పీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది.. ఆఫీస్‌ అసిస్టెంట్‌ అప్పారావుకు చలానా డబ్బులు రూ.5,900 తో పాటు ఖర్చులకు రూ.200 ఇవ్వాలని వీరభధ్రరావు సూచించాడు.

అలాగే కేసు పూర్తిగా మాఫీ చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత్యంతరం లేక వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం కిరాణా వ్యాపారి కనకరాజు రూ.10 వేలు లంచం తీసుకొని ఆఫీస్‌కు వెళ్లాడు. వీరభద్రరావు, జి.అప్పారావు విధులు నిర్వహిస్తున్నారు. ఆఫీస్‌లో వీరిద్దరి ప్రైవేటు కార్యకలాపాలు చూడటానికి నియమించుకున్న వై.రాజేష్‌ అనే వ్యక్తికి రూ.10 వేలు ఇవ్వాలని సూచించారు. రాజేష్‌కి డబ్బులు ఇస్తున్న సమయంలో అక్కడే కాపుగాసిన ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. దాడుల్లో సీఐలు గణేష్, రమేష్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top