ఆగి ఉన్న కారులో రూ. 16 లక్షలు మాయం

16 Lakhs Were Stolen In Car By Thieves In Krishna District  - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆగివున్న కార్లను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  అల్లాపురంలోని రావ్‌ఫిన్ రియల్ ఎస్టేట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న షేక్ సిలార్ యనమలకుదురు నుంచి రోజూ వచ్చి ఉద్యోగం చేస్తారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఆఫీసు కాంపౌండ్‌లో ఉన్న గోశాల వద్ద కారు ఆపి గోశాలను సందర్శించుకునేందకు వెళ్లారు. ఈ సమయంలో కారు వెనుక డోర్ అద్దాలు పగులగొట్టి కారు సీటులో ఉంచిన రూ. 16 లక్షల నగదు, ఏటీఎం, పాస్ పోర్ట్, పాస్‌బుక్‌లు గుర్తు తెలియని  వ్యక్తులు దొంగిలించారు. కారు పెట్టిన ప్రదేశం చీకటిగా ఉండడంతో గమనించలేకపోయిన సిలార్ అక్కడి నుంచి యనమలకుదురు బయలుదేరి    వెలుతుండగా.. మార్గ మధ్యలో కేసరపల్లి వద్దకు వెళ్ళేసరికి కారు అద్దం పగిలిన ఆనవాలు కనబడింది. దీంతో  సిలార్‌ ఒక్కసారిగా  కారు ఆపి పరిశీలించగా.. కారు అద్దం ధ్వంసం చేసి కారులో ఉన్న రూ. 16 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా గుర్తించాడు.

వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే గత నాలుగు రోజుల్లో అదే ప్రాంతంలో ఆగివున్న రెండు కార్ల అద్దాలు ధ్వసం చేయడం, తాజాగా ఆదివారం ఆగి ఉన్న కారులో 40 నిమిషాల్లో అద్దాలు పగులగొట్టి రూ.16 లక్షలు దోపిడీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏమైనా దొంగాల గ్యాంగ్ తిరుగుతుందా.. సిలార్ కారులో డబ్బు పెట్టినట్టు తెలిసినవారే ఎవరైనా అతన్ని అనుసరించి దోపిడీ​ పాల్పడ్డారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిలార్ మాత్రం తనకు తెలిసినవారి మీద ఎటువంటి  అనుమానం లేదని.. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top