మార్కెట్‌ మాట.. మళ్లీ మోదీ!! | Satta Bazzar bets on 245-250 seats for BJP in LS polls | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ మాట.. మళ్లీ మోదీ!!

Mar 14 2019 12:03 AM | Updated on Mar 14 2019 5:41 AM

Satta Bazzar bets on 245-250 seats for BJP in LS polls - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించనుందన్న అంచనాలతో సత్తా మార్కెట్లో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నడిచే ఈ బెట్టింగ్‌ మార్కెట్‌ను సత్తాబజార్‌గా పిలుస్తారు. పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై గత నెలలో భారత వాయుసేన మెరుపు దాడులతో బీజేపీ విజయావకాశాలు మెరుగుపడినట్టు సత్తా మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాయుసేన దాడులకు ముందు వరకు త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 200–230 సీట్ల వరకు రావచ్చన్న అంచనాలతో బుకీలు బెట్టింగ్‌ నడిపారు. ఈ అంచనాల ఆధారంగా ప్రతీ రూపాయి బెట్టింగ్‌పై రూపాయిని ఆఫర్‌ చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 245–251 సీట్ల వరకు రావచ్చని, ఎన్‌డీఏ పక్షాలతో కలుపుకుంటే ఈ స్కోరు 300 వరకు ఉంటుందని బుకీలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు లభిస్తుందన్న అంచనాలు పెరిగాయి. మ్యాజిక్‌మార్క్‌ 272 సీట్లు అని తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ 200 లోక్‌సభ సీట్లు, అంతకంటే ఎక్కువ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాలపై 7:1 నిష్పత్తిలో గత నెల వరకు బెట్టింగ్‌లు నడిచాయి. అంటే ఈ అంచనాలు నిజమైతే ప్రతీ రూపాయి బెట్టింగ్‌కు రూ.7 చెల్లిస్తారు. కానీ, తాజాగా ఇది 10:1కు పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందు వరకు బెట్టింగ్‌లు నిదానంగా కొనసాగగా, షెడ్యూల్‌ తర్వాత జోరు పెరిగింది. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో సత్తా మార్కెట్‌లో బెట్టింగ్‌లు కూడా అదే రోజు గడువు తీరిపోతాయి. 

మొదలైన ప్రీ–ఎలక్షన్‌ ర్యాలీ... 
పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల(సర్జికల్‌ స్ట్రైక్స్‌) తర్వాత ఎన్‌డీఏకు పరిస్థితులు మరింత సానుకూలంగా మారాయనేది ఇటీవలి సర్వేల సారాంశం. గతంతో పోలిస్తే బీజేపీకి సొంతంగా కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ.. కచ్చితంగా మళ్లీ ఎన్‌డీఏ సర్కారే ఏర్పాటు అవుతుందని మెజారిటీ ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్టాక్‌ మార్కె ట్లో ఎన్నికల ముందస్తు ర్యాలీ కూడా కొనసాగుతుండటం గమనార్హం. మోదీ మరోసారి విజయం సాధించొచ్చనే విషయాన్ని మార్కెట్లు ముందుగానే డిస్కౌంట్‌ చేసుకుంటున్నాయనేదానికి ఈ ప్రీ–ఎలక్షన్‌ ర్యాలీ నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత(ఏప్రిల్‌ 10) నుంచి వరుసగా మూడు రోజులు మార్కెట్లు పరుగులు తీశాయి. నిఫ్టీ గడిచిన మూడు రోజుల్లో 350 పాయింట్లు, సెన్సెక్స్‌ 1,000 పాయిం ట్లు మించి దూసుకెళ్లాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇప్పటికే కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరింది కూడా. ఇదే జోరు కొనసాగితే ఎన్నికల ముందే నిఫ్టీ, సెన్సెక్స్‌ కూడా కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలను నమోదు చేయొచ్చని మార్కెట్‌ పండితులు జోరుగా అంచనా వేస్తున్నారు.

ఫలోడి టౌన్‌ కేంద్రంగా..
క్రికెట్‌ బెట్టింగ్, ఈక్విటీలు, కమోడిటీలకు సంబంధించి డబ్బా ట్రేడింగ్‌ ఉన్నట్టే... ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్‌లు గ్రే మార్కెట్లో జరుగుతుంటాయి. ఎన్నికలకు సంబంధించిన స్పెక్యులేషన్‌కు రాజస్థాన్‌లోని ఫలోడి పట్టణం కేంద్రంగా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ మార్కెట్లకు సైతం ఫలోడి మార్కెటే దిశానిర్దేశం చేస్తుంటుంది. త్వరలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న బెట్టింగ్‌లన్నీ ప్రాథమిక అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. త్వరలో రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా బెట్టింగ్‌ ట్రేడ్స్‌ జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేయడంతోపాటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత బెట్టింగ్‌ల అంకం తుది దశకు చేరుకుంటుందని అంచనా.  
బుకీల ఆఫర్‌ ఇదీ...

►బీజేపీకి 251 స్థానాలు వస్తాయన్న అంచనాలకు 1:1 
► కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అంచనాలకు 10:1 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement