
సాక్షి, ముంబై: కరోనా కల్లోలం, మూడవ రోజు లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా శుక్రవారం ఉదయం 10 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మీడియాతో మాట్లాడనుంది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేద జనాన్ని ఆదుకునేందుకు కేంద్రం గురువారం రిలీఫ్ ప్యాకేజీ ద్వారా కొన్ని ఉపశమన చర్యల్ని చేపట్టిన విషయం తెలిసిందే. 1.7 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించింది. మరోవైపు ఆర్‌బీఐ కూడా ఆర్థిక ఉపశమన చర్యల్ని ప్రకటించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రుణ గ్రహీతలకు ఊరట లభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రుణాల పేమెంట్ల వాయిదాల చెల్లింపులను స్వల్ప కాల వ్యవధిలో ఉపశమనం లభించనుందని అంచనా. అలాగే రుణ సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలకు ద్రవ్య లభ్యతకు సంబంధించి కీలక నిర్ణయాన్ని గవర్నరు ప్రకటించే అవకాశం ఎదురు చూస్తున్నాయి. (‘కరోనా’ ప్యాకేజీ)
మరోవైపు ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 24 వేలుకు పైగా దాటిపోయింది. అలాగే కరోనా వైరస్ ఇటలీని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మరణాల సంఖ్య తాజా సమాచారం ప్రకారం 8 వేలను దాటిపోయింది. ఇటు దేశీయంగా 727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 16కు చేరింది. (కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు)