భారీగా తగ్గించిన హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు

Indian Companies Dramatically Reduced H1B Visa Filing - Sakshi

వాషింగ్టన్‌ : భారత ఐటీ కంపెనీలు హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించినట్టు తెలిసింది. కేవలం కంపెనీలు మాత్రమే కాక విదేశీయులు సైతం అమెరికా కంపెనీలపై తక్కువ ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడైంది. ట్రంప్‌ కార్యాలయం చేపడుతున్న యాంటీ-ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌తో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని టాప్‌ సిలికాన్‌ వ్యాలీ న్యూస్‌పేపర్‌ పేర్కొంది. హెచ్‌-1బీ వీసా ప్రొగ్రామ్‌ విషయంలో ట్రంప్‌ కార్యాలయం చాలా కఠినతరమైన ప్రక్రియను చేపడుతుందని శాన్‌ఫ్రాన్సిస్కో క్రోనికల్‌ ఎడిటోరియల్‌ బోర్డు పేర్కొంది. ఇటు ఇది దరఖాస్తులపైనా, అటు కంపెనీలపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. 

దీంతో భారత కన్సల్టింగ్‌ సంస్థలు భారీగా హెచ్‌-1బీ వీసా ఫైలింగ్‌లను తగ్గించేసేయని తెలిపింది. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌1బీ దరఖాస్తుల ప్ర​క్రియ ఈ నెల 2 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడిన టెక్నాలజీ కంపెనీలు ప్రతేడాది వందల కొద్దీ ఉద్యోగులను భారత్‌, చైనా దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అయితే ట్రంప్‌ కార్యాలయం మాత్రం ఈసారి విదేశీ ఉ‍ద్యోగులను తగ్గించడానికి హెచ్‌-1బీ వీసా విషయంలో కఠినతరమైన నిబంధనలను అమలు చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాల ఫైలింగ్‌లు భారీగా తగ్గిపోయాయి. 

అంతేకాక ఈ నిబంధనల వల్ల 26 శాతం కంపెనీలు తమ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నాయని, అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌లో ప్రస్తుతం ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్టు శాన్‌ఫ్రాన్సిస్కో క్రోనికల్‌ పేర్కొంది. అయితే విదేశాల్లో జన్మించిన వర్కర్లు అమెరికా ఆర్థికవ్యవస్థకు మంచే చేకూరుస్తారని తెలిపింది. మంచి నైపుణ్యమున్న ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటే, అన్ని పరిశ్రమల్లో పోటీతత్వం పెరుగుతుందని పేర్కొంది. హెచ్‌-1బీ వీసాలకు డిమాండ్‌ తగ్గిపోతుండంతో, టెక్నాలజీ రంగంలో కావాల్సి ఉన్న 5,48,000 టెక్‌ ఉద్యోగాల విషయంలో కార్పొరేషన్లు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. చాలా ఉద్యోగాలున్నాయని, కానీ వాటిని పూరించడానికే ఉద్యోగులు లేరని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top