‘అక్టోబర్’కు అంతా రెడీ! | Flipkart Big Billion Day 2016, Amazon Great Indian Sale, Snapdeal Unbox Sale Offers to Go Head to Head | Sakshi
Sakshi News home page

‘అక్టోబర్’కు అంతా రెడీ!

Sep 27 2016 12:43 AM | Updated on Sep 29 2018 5:52 PM

‘అక్టోబర్’కు అంతా రెడీ! - Sakshi

‘అక్టోబర్’కు అంతా రెడీ!

దీపావళి, దసరా ఉత్సవాలకు ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమైపోయాయి. భారీ విక్రయాలకు ఈ సారి అక్టోబర్ తొలి వారాన్ని అవి ముహూర్తంగా పెట్టుకున్నాయి.

భారీ విక్రయాలకు ఈ-కామర్స్ సంస్థల రంగం
1-5 మధ్య అమెజాన్; 2-6  మధ్య ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సేల్స్
భారీ డిస్కౌంట్లు ఉండకపోవచ్చంటున్న నిపుణులు
అమ్మకాలు కూడా తగ్గవచ్చని రీసెర్చ్  సంస్థల అంచనా

న్యూఢిల్లీ: దీపావళి, దసరా ఉత్సవాలకు ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమైపోయాయి. భారీ విక్రయాలకు ఈ సారి అక్టోబర్ తొలి వారాన్ని అవి ముహూర్తంగా పెట్టుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇప్పటికే తేదీలను ఖరారు చేయగా... పేటీఎం, షాప్‌క్లూస్ వంటివి ఇంకా ప్రకటించలేదు. నిజానికి ఒక నెలలో సగటున జరిపే విక్రయాలకు రెండు మూడు రెట్లు అధికంగా ఈ ‘ఫెస్టివల్ డేస్’లో నమోదు చేయాలన్నది ఈ కామర్స్ సంస్థల వ్యూహం.

నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ, ఇతర చార్జీలు లేకుండా వాయిదాల్లో చెల్లించడం), వేగంగా వస్తువుల డెలివరీ, ఈజీ ఎక్స్చేంజ్ ఇలా విభిన్న సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి కూడా. అయితే ఎన్ని ఆఫర్లున్నా కస్టమర్ చూపు డిస్కౌంట్లపైనే ఉంటుందన్న విషయం వాటికి తెలియనిది కాదు. అందుకే భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. దీనికోసం అమెజాన్ ఇండియా రూ.125 కోట్లు, స్నాప్‌డీల్ రూ.200 కోట్లు కేటాయించాయి. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే ప్రచార ప్రకటనల కోసం రూ.30 కోట్లు వెచ్చించనుంది.

స్నాప్‌డీల్ ‘ఈజీ ఎక్స్చేంజ్’
స్నాప్‌డీల్ అక్టోబర్ 2-6 మధ్య ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. పాత ఉత్పత్తిని కొత్త ఉత్పత్తితో ఎక్స్చేంజ్ చేసుకునే సదుపాయాన్నిస్తోంది. ఎలక్ట్రానిక్ పరిరకాలు, మొబైల్ ఫోన్లపై ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. డెలివరీ కోసం తాత్కాలికంగా 10వేల మంది లాజిస్టిక్ సిబ్బందిని నియమించుకుందని రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ వెల్లడించింది.

ఫ్లిప్‌కార్ట్ బీబీడీ
దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే (బీబీడీ)’ విక్రయాలు అక్టోబర్ 2- 6 మధ్య సాగనున్నాయి. ‘నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్’ అమ్మకాలను వెల్లువెత్తిస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, ఇతర గృహోపకరాణలను నో కాస్ట్ ఈఎంఐ కింద ఆఫర్ చేయనుంది. గతంలో పాపులర్ అయిన రూ.1 ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్లను సైతం ప్రకటించే అవకాశం ఉంది.

 డిస్కౌంట్లు ఉండకపోవచ్చు...
పోటాపోటీగా అమ్మకాలు జరపనున్నప్పటికీ ఏ సంస్థా భారీ డిస్కౌంట్ల జోలికెళ్లే అవకాశాల్లేవన్నది నిపుణుల అంచనా. ఈ కామర్స్ సంస్థల డిస్కౌంట్లపై నిషేధం విధించాలని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఇటీవల పేర్కొనటాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్ భారాన్ని సాధ్యమైనంత వరకు విక్రయదారులకే వదిలేస్తాయని, తమ సొంత డిస్కౌంట్లను ఆఫర్ చేసే పరిస్థితిలో అవి లేవని ‘రెడ్‌సీర్’ పేర్కొంది. ఇది ఆన్‌లైన్ విక్రయదారులకు, కొనుగోలు దారులకు నిరుత్సాహం కలిగించవచ్చని కూడా ఈ సంస్థ తెలిపింది. ‘‘ఈ అక్టోబర్లో అన్ని ఈ-కామర్స్ సంస్థల విక్రయాలూ కలిపినా రూ.10వేల కోట్లు దాటక పోవచ్చు. ఎందుకంటే జనవరి - మార్చి త్రైమాసికంలో ఈ కామర్స్ సంస్థల విక్రయాలు 19 శాతం పడిపోయాయి. ఏప్రిల్-జూన్ మధ్య కూడా మరో 5-10 శాతం మేర తగ్గాయి’ అని రెడ్‌సీర్ వివరించింది.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అక్టోబర్
1 - 5 మధ్య ‘ద గ్రేట్ ఇండియా ఫెస్టివల్’ పేరిట అమెజాన్ అమ్మకాలు జరపనుంది. అదే రోజు... ఒకరోజు... రెండ్రోజుల డెలివరీ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని సంస్థ చూస్తోంది. పండుగ రోజుల్లో భారీ ఆర్డర్ల వల్ల డెలివరీ లేటయ్యే పరిస్థితులుండగా... అమెజాన్ ఇదే అంశాన్ని మార్కెటింగ్‌కు ఉపయోగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement