ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్‌ కీలక సమీక్ష

Finance Minister reviews state of economy at FSDC meeting - Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ప్రముఖుల హాజరు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్‌’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.

దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్‌ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్‌బీఎఫ్‌సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్‌ తెలిపారు. సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు  పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top