‘పారిపోయిన నేరస్తుడి’గా మాల్యా

ED seeks 'fugitive' tag for Vijay Mallya under new ordinance - Sakshi

ప్రకటించాలంటూ కోర్టుకు ఈడీ

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని విజ్ఞప్తి

ముంబై/న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్‌ కింద వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను ’పారిపోయిన నేరగాడి’గా ప్రకటించాలని ముంబైలోని స్పెషల్‌ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పిటిషన్‌ వేసింది. తద్వారా రూ.12,500 కోట్ల విలువ చేసే ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని కోరింది. ఇలాంటి నేరాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ట్రయల్‌ పూర్తయి, ఆస్తుల జప్తుకు అనేక సంవత్సరాలు పట్టేస్తోంది.

ఈ నేపథ్యంలోనే  కొత్తగా అమల్లోకి వచ్చిన పలాయన ఆర్థిక నేరగాళ్ల పట్టివేత ఆర్డినెన్స్‌ కింద ఈడీ తాజా పిటిషన్‌ వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరిట ఐడీబీఐ బ్యాంకు, ఎస్‌బీఐ సారథ్యంలోని కన్సార్షియం నుంచి తీసుకున్న రూ. 9,000 కోట్లకు పైగా రుణాలు మాల్యా ఎగవేసిన కేసుకు సంబంధించి ఈడీ ఈ పిటిషన్‌ వేసింది. ‘బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం మాల్యాకు ముందు నుంచే లేదు.

మాల్యాకు, ఆయనకు చెందిన యూబీహెచ్‌ఎల్‌ (యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌) వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన వనరులు ఉన్నప్పటికీ, బ్యాంకుల నుంచి ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలను దాచిపెట్టి ఉంచారు‘ అని ఈడీ ఆరోపించింది. ఇప్పటికే మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద మాల్యాతో పాటు ఇతర నిందితులపైనా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను దీనికి జతపర్చింది. ఆయనపై నాన్‌–బెయిలబుల్‌ వారంట్లు జారీ అయిన సంగతి కూడా తెలియజేసింది.  

త్వరలో నీరవ్‌ మోదీపై కూడా..
పలాయన నేరగాళ్లను శిక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ఆర్డినెన్స్‌ కింద ఈడీ వేసిన మొదటి పిటిషన్‌ ఇదే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) స్కామ్‌ నిందితులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలపై కూడా దీన్ని ప్రయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్‌ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో పలువురు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోతున్న ఉదంతాల నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top