పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్‌

Corporate Tax Rate Cut A Bold Positive Step Says RBI Governor - Sakshi

కార్పొ పన్ను కోతతో కీలక పరిణామం

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆర్థిక మంత్రితో భేటీ

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదిగా ఆయన అభివరి్ణంచారు. ఆరి్థక మందగమనానికి మందుగా దేశీయ కంపెనీలపై 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ గత వారం తగ్గించిన సంగతి తెలిసిందే. 28 సంవత్సరాల్లో చరిత్రాత్మకమైనదిగా ఈ నిర్ణయాన్ని కార్పొరేట్లు స్వాగతించారు. ‘‘ఇది ఎంతో సాహసోపేతమైన చర్య. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఆరి్థక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అత్యంత సానుకూలమైనది. భారత్‌ కార్పొరేట్‌ పన్ను ప్రస్తుతం ఆసియాన్‌ అలాగే ఇతర ఆసియా దేశాల్లో అతితక్కువగా ఉంది.

అంతర్జాతీయ వాణిజ్య పోటీ అంశాలకు వస్తే, ఇది భారత్‌కు అత్యంత సానుకూలమైనది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోణంలో చూసినా లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుల (ఎఫ్‌డీఐ) వైపు నుంచి ఆలోచించినా, భారత్‌ ఇప్పుడు పోటీ పూర్వక వాతావరణంలో నిలిచింది. అధిక పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాన్ని పొందింది’’ అని దాస్‌ పేర్కొన్నారు. ‘‘ఇక దేశీయ కార్పొరేట్ల విషయానికి వస్తే, వారి వద్ద ఇప్పుడు అదనపు నిధులు ఉంటాయి. దీనితో వారు మరిన్ని పెట్టుబడులు పెట్టగలుగుతారు’’ అని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. రుణ భారంలో ఉన్న కంపెనీలు దీనిని కొంత తగ్గించుకోగలుగుతాయని, వాటి బ్యాలెన్స్‌ షీట్లు మెరుగుపడతాయన్నారు.

ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రితో చర్చ
అంతకుముందు ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ముందు జరిగే సాంప్రదాయక సమావేశంగా ఆయన దీనిని పేర్కొన్నారు. ‘‘పాలసీ సమావేశానికి ముందు ఆరి్థక శాఖ మంత్రితో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశం కావడం, ఆరి్థక వ్యవస్థపై చర్చించడం గత ఎంతోకాలంగా ఉన్న సాంప్రదాయమే. ఇప్పుడు జరిగింది కూడా ఈ తరహా సమావేశమే’’ అని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా పావుశాతం రెపోరేటు కోత ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ఉద్దీపన చర్యలు ప్రకటించడానికి వీలుపడదని, ద్రవ్య పరిస్థితులు ఇందుకు దోహదపడవని ఇటీవల పేర్కొన్న ఆర్‌బీఐ గవర్నర్, రెపో రేటు తగ్గింపునకు మాత్రం అవకాశం ఉందని అభిప్రాయపడిన సంగతి ఇక్కడ గమనార్హం.  ఆర్థిక వృద్ధి లక్ష్యంగా గడచిన 4 త్రైమాసికాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 1.1% తగ్గింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 5.4%కి దిగివచి్చంది. అంతేకాకుండా  ఈ ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్లకు బదలాయించడానికీ ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.  బ్యాంక్‌ రుణ రేటును రెపో, తదితర బెంచ్‌మార్క్‌ రేట్లకు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అనుసంధానించాలని  ఆదేశించింది. 3 నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆర్‌బీఐ సూచించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top