ఏడాదిలో రూ.71వేల కోట్ల మాయం!

Bank fraud touches unprecedented Rs 71,500 crore in 2018-19 - Sakshi

2018–19లో బ్యాంకులకు భారీ టోపీలు

మోసాలకు సంబంధించి 6,800 కేసులు

రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడి

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 6,801 కేసులు నమోదు కాగా.. విలువపరంగా ఇవి రూ. 71,500 కోట్లు ఉండొచ్చని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. 2017–18లో రూ. 41,167 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలిస్తే 2018–19లో పరిమాణం ఏకంగా 73 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 53,334 ఫ్రాడ్‌ కేసులు నమోదు కాగా, రూ.2.05 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆర్‌బీఐకి నివేదించిన ఫ్రాడ్‌ కేసులకు సంబంధించి ఆయా బ్యాంకులు క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. అయితే ఈ కేసుల్లో తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం సిద్ధంగా లేదని పేర్కొంది.  

నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి వ్యాపారవేత్తలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కుంభకోణాలపై దృష్టి సారించిన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ప్రత్యేకంగా అధ్యయనం చేసి, టాప్‌ 100 ఫ్రాడ్‌లపై నివేదిక కూడా రూపొందించింది. మోసాలకు పాల్పడిన తీరు, నగదు పరిమాణం, రుణ లావాదేవీల తీరుతెన్నులు, విధానపరమైన లొసుగులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. ప్రధానంగా 13 రంగాల్లో చోటు చేసుకున్న ఫ్రాడ్స్‌ను పరిశీలించింది. తయారీ, వజ్రాభరణాలు, వ్యవసాయం, మీడియా, ఏవియేషన్, ట్రేడింగ్, ఐటీ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. అటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తదితర ఏజెన్సీలు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top