చంద్రబాబుపై భేరి

చంద్రబాబుపై భేరి - Sakshi


వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ వెల్లడి

వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ హామీలిచ్చారు.. ఎన్నికల మేనిఫెస్టోలు, కరపత్రాలు, ప్రకటనలతో హోరెత్తించారు

అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు

పంటరుణాలని మాత్రమే అన్నానంటున్నారు, డ్వాక్రా రుణాల మాఫీ లేదంటున్నారు

అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబును నిలదీయండి.. నేటి ధర్నాల్లో కలసికట్టుగా పాల్గొనండి

 

సాక్షి, హైదరాబాద్: రైతుల, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ విషయంలో మాట తప్పి ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు.

 

 వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రచురించిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలు, ఇంటింటికీ పంపిణీ చేసిన కరపత్రాలను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. మరో ఐదేళ్లపాటు ఎన్నికలు ఉండవన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఇది చాలదన్నట్లు అడ్డగోలుగా పింఛన్లు కత్తిరించే కార్యక్రమం కూడా జరిగిందన్నారు.

 

 తాము ఆందోళనకు దిగాం కాబట్టే చంద్రబాబు ఈరోజు కొంతమేరకైనా రుణమాఫీ ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవైఖరికి నిరసనగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో అందరూ కలిసికట్టుగా పాల్గొనాలని జగన్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...

 

 రాష్ట్రంలో కోటికి పైగా రైతుల ఖాతాలుండగా చంద్రబాబు 22 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తింప జేస్తామని చెప్పడం దారుణం. అదికూడా ఎంత మొత్తం మాఫీ చేస్తారో చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. మరోవైపు మొత్తం రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రూపాయల రుణంపై 14 శాతం అపరాధ వడ్డీ అంటే రూ.14 వేల కోట్లవుతుంది. కానీ చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం కేవలం రూ.5 వేల కోట్లే. ఈ మొత్తంతో  20 శాతం రుణ మాఫీ చేస్తానని చెప్పడం భావ్యమేనా?

 

 2012-13, 2013-14 ఖరీఫ్ కాలాలకు సంబంధించి పంటల బీమా కింద వచ్చిన రూ.68 కోట్లు, రూ.570 కోట్లు రైతులు చెల్లించాల్సిన అప్పుల కింద జమచేశారు. ఇప్పుడు రబీ ముగుస్తున్నా రైతులకు పంటల బీమా లేదు. కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు మాఫీ కాలేదు. ఇది చాలదన్నట్టు రైతులపై అపరాధ వడ్డీ భారం పడింది..




చంద్రబాబుకు అన్నీ తెలుసు

చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ)లో ఏఏ జిల్లాల్లో ఏ మేరకు అప్పులున్నాయో స్పష్టంగా వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జూన్ 30 వతేదీన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు సమర్పించిన నివేదికలోని 6వ పేజీలో 2014 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం రైతుల రుణాలు రు.87,612 కోట్ల మేరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవికాక డ్వాక్రా మహిళల రుణాలు రు. 14,204 కోట్ల రూపాయలున్నాయి. రెండూ కలిపితే రు 1,01,816 కోట్లు ఉన్నాయి.

 

 ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. అప్పులెంత ఉన్నాయో, ఖాతాలెన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుసు. అయినా ఇవాళ ప్లేటు మార్చారు. పంటరుణాలని మాత్రమే అన్నానని చెబుతున్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అనలేదని బుకాయిస్తున్నారు. ఒక్కో సంఘానికి పది వేల రూపాయలు మాత్రం ఇస్తానని చెప్పానన్నాడు. ఇంత కంటే దారుణం, అన్యాయం మరొకటి ఉంటుందా?

 

 ఎన్నికలపుడు బాబొస్తాడు, జాబు (ఉద్యోగం) వస్తుందన్నారు. జాబ్ రాకపోతే ప్రతి ఇంటికి రూ.2000లు నిరుద్యోగభృతి ఇస్తామని టీడీపీ వారు కరపత్రాలు వేసి ఇంటింటికీ పంచారు. రాష్ట్రంలో ఉన్న 1.75 కోట్ల ఇళ్లకు ఎక్కడి నుంచి భృతి తెచ్చి ఇస్తావయ్యా? అని మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఎప్పటినుంచి ఇస్తారో ఇప్పుడు మాట్లాడటంలేదు. డ్వాక్రా రుణాల గురించి అడిగితే తరువాత మాట్లాడదామంటూ దాటవేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున తొలి సంతకం రుణాల మాఫీపైనే చేస్తానని చెప్పి, కోటయ్య కమిటీ నియామకంపై చేశారు. అది కూడా ఖాతాల్లో కోతలు పెట్టడానికి.




 చంద్రబాబు ప్లేటు ఫిరాయిస్తున్నారు

 చంద్రబాబు ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఏం చెప్పారో, ఇపుడు ఎలా ప్లేటు ఫిరాయిస్తున్నారో క్లుప్తంగా మీకు వివరిస్తాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంలో ప్రధాన పాత్ర వహించిన చంద్రబాబు తన ఎంపీలతో విభజనకు అనుకూలంగా ఓట్లేయించి తమవల్లే విభజన జరిగిందని చెప్పుకున్నారు. విభజన తరువాత తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి వేర్వేరుగా రెండు మేనిఫెస్టోలను చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఆ రెండు మేనిఫెస్టోల్లో పొందుపర్చారు.

 

 చంద్రబాబుకు గెజెట్‌లాంటి పత్రిక అయిన ఈనాడులో ఆ మరుసటిరోజు ‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ...’ అనే శీర్షికతో ప్రచురించారు. ఆ తరువాత 2014 ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో రెండో లైనులోనే వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి వివరించారు. నాకన్నీ తెలుసు, తెలిశాకే వ్యవసాయరుణాల మాఫీకి వెళుతున్నానని చంద్రబాబు స్వయంగా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మోదీ బొ మ్మ, తన బొమ్మను పొందుపర్చి ప్రచురిం చిన కరపత్రాల్లో మొట్టమొదటి అంశమే రైతు రుణాల మాఫీ, ఇక రెండో అంశంగా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ హామీ ఉంది.

 

 ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజున చంద్రబాబు గెజెట్ పత్రిక ఈనాడులో జారీ చేసిన ప్రకటనలో మొదటిపాయింటే రైతు రుణాల మాఫీ జరుగుతుందని ప్రచురించారు. రెండో పాయింట్ డ్వాక్రా మహిళల రుణాల రద్దు చేస్తామని వివరించారు. ప్రజలతో పని ఉన్నపుడు చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ, కరపత్రాల్లోనూ ఈ అంశాలే విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద లైట్లు అమర్చిన హోర్డింగ్‌లలో రుణమాఫీ ప్రచారం చేసుకున్నారు. ఇక టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు రుణమాఫీ ప్రచారమే కనిపించింది. చంద్రబాబు అపుడేం చెప్పారో మీరే చూడండి. (వీడియోలను ప్రదర్శించారు)

 

 రైతుల రుణాల పూర్తిగా మాఫీ చేసే బాధ్యత నాదే... మీరంతా (రైతులు) కష్టాల్లో ఉన్నపుడు చూశా... మిమ్మల్ని ఆ కష్టాలనుంచి గట్టెక్కిస్తా... అధికారంలోకి వచ్చాక నా మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తా... రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలను మాఫీ చేస్తాం... అంటూ చంద్రబాబు వివిధ సభల్లో చేసిన ప్రసంగాలే సాక్ష్యాలు.

 

 బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న రైతులు ఇక్కడ ఎవరున్నారో చేతులెత్తండి... మీ అందరి రుణాలను మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఓ సభలో చెప్పడం నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచీ 86 మంది రైతులు నిరాశానిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క అనంతపురంలోనే 40 మందికిపైగా మృతి చెందినట్లు పత్రికల్లో వారి పేర్లతో సహా ప్రచురించారు.

 

విభజన తరువాత రెవెన్యూ లోటు ఉండబోతోందనే విషయం చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తెలియదా? లోటు ఉంటుందనే విషయం బాబుకూ తెలుసు, జగన్‌కు కూడా తెలుసు. అన్నీ తెలిశాకే ప్రజలను మోసం చేయడానికే ఈ హామీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top