కొడుకు పుట్టలేదని విడాకులు అడుగుతున్నాడు

Village Woman Complaint On Husband For Divorce Notice - Sakshi

పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన గని గ్రామ మహిళ

కర్నూలు:  కొడుకు పుట్టలేదని భర్త రవికుమార్‌ విడాకుల నోటీసు పంపించాడని, తనకు న్యాయం చేయాలంటూ గడివేముల మండలం గని గ్రామానికి చెందిన మహిళ పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యాక్రమంలో భాగంగా 9121101200 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ గోపీనాథ్‌జెట్టి నోట్‌ చేసుకున్నారు. అనంతరం నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టారని, అయితే మగ సంతానం కలగలేదనే ఉద్దేశంతోనే భర్త రవికుమార్‌ తనకు విడాకులు నోటీసు పంపాడని ఎలాగైనా న్యాయం చేయాలని ఆమె ఎస్పీని వేడుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. 

ఫిర్యాదుల్లో కొన్ని..
విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఇప్పిస్తామని వ్యవసాయాధికారి ఒకరు డబ్బులు తీసుకొని మోసం చేశాడని, విచారించి అతనిపై చర్యలు తీసుకొని తమ డబ్బులు వాపసు ఇప్పించాలని ఆళ్లగడ్డ మండలం పెద్దకంబలూరుకు గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు.  
తనభర్త కారు డ్రైవర్‌గా పని చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని బిడ్డతో పాటు తనను పట్టించుకోవడం లేదని పగిడ్యాల మండల పాతకోట గ్రామానికి చెందిన నాగరత్నమ్మ ఫిర్యాదు చేశారు. భర్తకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురం చక్కబెట్టాల్సిందిగా ఆమె వేడుకున్నారు.
అల్లుడు తన కుమార్తె పిల్లలను వదిలి వేరే అమ్మాయితో వెళ్లి పోయాడని అతడని ఎలాగైనా రప్పించి తన కూతురి కాపురం నిలబెట్టాని గూడూరు సింగరేణి కాలనీకి చెందిన దస్తగిరి ఫిర్యాదు చేశారు.
ఎక్స్‌ ఆర్మీ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఓ వ్యక్తి మోసం చేశాడని ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య ఫిర్యాదు చేశారు.  
పోలీసు ప్రజాదర్బార్, డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు బాబుప్రసాద్, నజీముద్దీన్, ఖాదర్‌బాషా, వెంకటాద్రి, సీఐలు రామయ్యనాయుడు, మురళిధర్‌రెడ్డి, ములకన్న, పవన్‌ కిషోర్, సుబ్రమణ్యం, ఎస్‌ఐలు మోహన్‌కిషోర్, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top