దట్టంగా కురుస్తున్న పొగమంచు ఇద్దరిని బలితీసుకుంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆటో డివైడర్ ఎక్కి బోల్తాపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: దట్టంగా కురుస్తున్న పొగమంచు ఇద్దరిని బలితీసుకుంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఆటో డివైడర్ ఎక్కి బోల్తాపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన మండలంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలోని యంనంపేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి సీతారాంపూర్ గ్రామానికి చెందిన పాండాల ఆంజనేయులు, కవిత(35) దంపతులు 15 ఏళ్ల క్రితం నగరంలోని జగద్గిరిగుట్టకు వలస వచ్చి వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఆంజనేయులు కార్పెంటర్. కవిత దుస్తులు ఉతుకుతూ ఇస్త్రీ చేసుకుంటూ కుటుంబ పోషణలో తోడ్పడుతోంది. వీరి కూతురు సంధ్య ఇంటర్ పూర్తి చేసుకొని ఇటీవలే బీఏఎంఎస్ కోర్సులో చేరింది. కుమారుడు మధు ఇంటర్ మొదటి ఏడాది కూకట్‌పల్లిలోని నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. వీరి బంధువు నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన సైదులు(26) మూడేళ్ల క్రితం వెంకటేశ్వరనగర్‌కే వలస వచ్చి స్థానికంగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. బంధువులవడంతో ఆంజనేయులు, సైదులు స్నేహంగా ఉండేవారు. ఆంజనేయులు స్వగ్రామంలో తన బావమరిది ఇంట్లో విందు ఉండడంతో ఆయన కుటుంబంతో సహా శుక్రవారం ఉద యం సైదులు ఆటోలో వెళ్లాడు. తిరిగి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నగరానికి బయలుదేరారు. 5:30 గంటల సమయంలో ఘట్‌కేసర్ మండల కేంద్రానికి చేరుకునే సరికి దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్డు సరిగా కనిపించడం లేదు.
బైపాస్ చౌరస్తా యంనంపేట్ వద్ద మలుపు తీసుకోవాల్సిన ఆటో పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో నేరుగా కొద్దిదూరం వెళ్లింది. వేగంగా ఉన్న ఆటో డివైడర్ ఢీకొని బోల్తా పడిం ది. ప్రమాదంలో ఆటో నడుపుతున్న సైదులు, కవితకు తీవ్ర గా యాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులు, ఆయన కూ తురు సంధ్య, కుమారుడు మధు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. మధు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అంత్యక్రియలకు వారి స్వస్థలాలకు తరలించారు. సైదులుకు భార్య భాగ్యలక్ష్మి ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.