ఆర్టీసీ అత్యవసర సేవలు

TSRTC Loss With Coronavirus Effect Perday 3.5 Crore - Sakshi

గ్రేటర్‌ ఆర్టీసీ ‘కరోనా’ సేవలు

వైద్యులు, నర్సులు, సిబ్బంది కోసం ప్రత్యేక బస్సులు

లాక్‌డౌన్‌ కారణంగా రోజుకు రూ.3.5 కోట్ల నష్టం

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సేవలు అందజేసే బస్సులు ప్రస్తుతం డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రతి డిపో నుంచి కొన్ని బస్సులను మాత్రం కరోనా బాధితులకు వైద్య సేవలందజేసే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా నడుపుతున్నారు. వారిని ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తీసుకురావడంతో పాటు తిరిగి ఇళ్ల వద్ద చేర్చేందుకు సిటీ బస్సులు అత్యవసర సేవలు అందజేస్తున్నాయి. ప్రతిరోజు 40 నుంచి 50 బస్సులను ఇందుకోసం వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్య సిబ్బందితో పాటు, పారిశుధ్య సిబ్బంది కోసం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో విజయ పాలను వినియోగదారులకు చేరవేసేందుకు కూడా ప్రస్తుతం సిటీబస్సులను వినియోగిస్తున్నారు. మరోవైపు బస్సుల నిర్వహణలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈడీ చెప్పారు. ప్రతి బస్సును పూర్తిగా శానిటైజ్‌ చేసిన అనంతరమే అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే ఈ ప్రత్యేక బస్సుల కోసం విధులు నిర్వహించే డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నగరంలోని 29 డిపోలను ఈ  అత్యవసర సేవల్లో భాగస్వామ్యం చేసేవిధంగా ప్రతి డిపో నుంచి బస్సులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. 

ఎలాంటి సేవలకైనా సిద్ధం..
ప్రపంచాన్నే చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూ అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతిముఖ్యమైన ప్రజారవాణా సంస్థ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి సేవలను అందజేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణ సదుపాయాలు నిలిచిపోయినా ప్రభుత్వం సూచించే అత్యవసర సేవలను నిర్వహించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు ఈడీ  చెప్పారు. అవసరమైతే అత్యవసర సేవల కోసం మరిన్ని బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.

అదనంగా రూ.కోటి ఖర్చు
ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో సాధారణంగా ప్రతిరోజు సుమారు 2,500 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 25 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. రోజుకు 30 వేల ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రతిరోజు రూ.3.5 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వచ్చే ఆదాయంకంటే బస్సుల నిర్వహణ, ఇంధన వినియోగం, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాల కోసం అదనంగా రూ.కోటి ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే  రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం లభిస్తే ఖర్చు మాత్రం రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ ఖర్చు లేకపోయినా ఆర్టీసీ మాత్రం లాక్‌డౌన్‌ కారణంగా రోజుకు రూ.3.5 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top