ఇదే'నా రా'జకీయం!

ఇదే'నా రా'జకీయం! - Sakshi


టీడీపీలో దళితుల అణిచివేత

వ్యూహాత్మకంగా ఎస్సీలకు దూరమవుతున్న రాజకీయ పదవులు

ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా ఇన్‌చార్జిలుగా ఇతరుల నియామకం

భగ్గుమంటున్న దళితులు


 

కర్నూలు: జిల్లా దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా తెలుగు దేశం పార్టీ అగ్ర నాయకులు వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా దళితులను అణిచివేసే కుట్ర చేస్తున్నారు. రాజ్యంగం కల్పించిన రిజర్వేషన్లను కూడా దక్కకుండా దూరం పెడుతున్నారు. టీడీపీ తీరుపై ఆయా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతన్నాయి. జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న తీరును పలువురు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కోడుమూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తు, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఎ. ప్రభాకర్ పార్టీ అధికారంలో లేని సందర్భాల్లో కూడా అనేక ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిన వ్యక్తికి ఆ పార్టీ చెయ్యిచ్చింది.



నిన్నటి వరకు నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న ఆయనను కాదని, పలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టడంతో ప్రభాకర్ సామాజిక వర్గం భగ్గుమంటోంది. నందికొట్కూరు రిజర్వుడు నియోజకవర్గంలో కూడా ఏడాది క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన లబ్బి వెంకటస్వామి ఇన్‌చార్జిగా ఉన్నా, ఆయనకు పోటీగా మండ్రా శివానందరెడ్డికి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించడాన్ని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే విషయాన్ని వారు పార్టీ సమావేశాల్లో కూడా వేలెత్తిచూపారు. అధికారం లేనంత వరకు వారి సేవలను వినియోగించుకొని, అధికారం వచ్చాక వారిని పక్కకు నెట్టడంతో ఆయా వర్గాలు చేసేదేమి లేక తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి.



ఓ వర్గాన్ని దూరం పెట్టే యత్నం

జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పలువురు ఎంఆర్‌పీఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యంగం కల్పించిన హక్కులను కూడా చంద్రబాబు హరించి వేస్తున్నారంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతింటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌సీ వర్గీకరణ చేపడతానని, పెద్ద మాదిగనై మీ రుణం తీర్చుకుంటానని చెప్పిన చంద్రబాబు, ప్రస్తుతం మాట తప్పుతున్నారని ఎమ్మార్పీఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనే ఎస్సీ నేతలకు చెక్ పెడుతున్న పార్టీ అధినాయకత్వం మిగిలిన నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జిలను ఎందుకు మార్చడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.



ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎత్తులు

ఏదో ఒక విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే టీడీపీ ఎత్తులు వేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తగినంత బలం లేకపోయినా, బరిలో నిలిచిన టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇన్‌చార్జిల మార్పు అని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న విధంగానే ప్రస్తుత ఎన్నికల్లో అడ్డదారుల్లో విజయం సాధించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.



ప్రత్యామ్నాయం కోసం నిరీక్షణ

తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లభించని పలువురు ఎస్‌సీ వర్గాలకు చెందిన నేతలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉండడంతో అదను కోసం వారు వేచి చూస్తున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top