రోడ్డు కం రైలు వంతెనపై ప్రయాణిస్తున్న మారుతీ కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రేగాయి. అంతెత్తున కీలలు ఎగసిపడుతూ
‘మారుతి’ నుంచి ఎగసిన కీలలు
రోడ్ కం రైలు బ్రిడ్జిపై దగ్ధమైన వాహనం
ఘటనతో స్తంభించిన రాకపోకలు
రాజమహేంద్రవరం క్రైం : రోడ్డు కం రైలు వంతెనపై ప్రయాణిస్తున్న మారుతీ కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రేగాయి. అంతెత్తున కీలలు ఎగసిపడుతూ వంతెనపై కారు తగలబడుతుంటే.. అటూ ఇటూ ఆగిపోయిన వాహనాల్లోని వారు భీతిల్లారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయంగా పరిణమించిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆనాల వెంకట అప్పారావు రోడ్డుకు చెందిన వల్లభనేని శ్రీనివాసరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం. ఆయన మారుతి కారుకు క్లచ్ వైర్ కంప్లయింట్ రావడంతో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఎస్‌బీ మోటార్స్ వారికి ఇచ్చారు.
సాయంత్రం మరమ్మతులు, సర్వీసింగ్ పూర్తి కావడంతో శ్రీనివాసరావు తరఫున బి.విజయ్ అనే వ్యక్తి కారును తీసుకొని గౌరీపట్నం బయలుదేరారు. బ్రిడ్జి మధ్యకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు ఇంజన్ నుంచి మంటలు రేగాయి. దీనితో విజయ్ కారును ఓ పక్కకు తీసి, నిలిపారు. ఆగిన వాహనాల్లో బిస్లేరీ వాటర్ క్యాన్ల వ్యాన్ ఉండడంతో ఆ నీటిని చిమ్మి మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఇంతలో సమాచారం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు బాగా దగ్ధమైంది. టూ టౌన్ సీఐ కె.నాగేశ్వరరావు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.