ఆదుకోకపోతే వలసలే గతి

Titli cyclone victims Agitation over their Children education and family - Sakshi

కుటుంబాలు జీవించేదెలా?

పిల్లల చదువులు సాగేదెలా?

ఆవేదన చెందుతున్న బాధితులు

శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో ఆదాయం ఇచ్చే జీడిమామిడి, కొబ్బరి తోటలతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, ఉప్పు, పప్పు పనికిరాకుండా పోయాయి. వీరంతా సర్కారు ప్రకటించిన 25 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఇంతవరకు అందలేదు. సర్కారు ఆదుకోకపోతే వలసపోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించడం లేదు. ‘గూడు కూడా లేనప్పుడు ఎక్కడుంటే ఏముంది? కూలి పనులు ఎక్కడ దొరికితే అక్కడకు వెళ్లక తప్పదు’ అంటూ బాధితులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. 

పెళ్లి ఇళ్లే పునరావాస కేంద్రం
కవిటి, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, పలాస తదితర గ్రామాల్లో బాధితుల బాధలు వర్ణణాతీతం. నాలుగు రోజులు నుంచి తాగునీరు లభించడం లేదు. వేలాది కుటుంబాలు పస్తులతో గడుపుతున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో ఒక వ్యక్తి తన బిడ్డకు నెలన్నర కిందట నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి బట్టలు, భోజనాలకు అవసరమైన సరుకులన్నీ ముందే తెచ్చుకున్నారు. ఆదివారం ఆ కుటుంబంలో పెళ్లి జరగడంతో పిలిచినవారితోపాటు పిలవని వారు కూడా భోజనాలకు వెళ్లారు. దీంతో వండిన వంటలు అయిపోయి మళ్లీ చేయాల్సి వచ్చింది. ఆ పెళ్లిల్లు తుపాను పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఆకలితో తుపాను బాధితులు ఎంత అల్లాడిపోతున్నారో తెలియడానికి ఈ సంఘటనే నిదర్శనం.

వర్షమొస్తే ఎక్కడుండాలో?
ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది చెట్ల కింద, పడిపోయిన ఇళ్ల పక్కన, పాఠశాలల్లో ఉంటున్నారు. ఇక వర్షమొస్తే ఎక్కడ తలదాచుకోవాలోనని భయపడుతున్నారు. తోటల్లోనే చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అక్కడ ఉండాలంటేనే భయమేస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు త్వరగా సాయం చేయాలని వారు కోరుతున్నారు. ‘మా మట్టి మిద్దె పడిపోయింది. దీంతో మేం కట్టుబట్టలతో మిగిలాం. మార్చుకోవడానికి దుస్తులు కూడా లేవు. సర్కారు ఆదుకోలేదు’ అని వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బైపల్లికి చెందిన పొలాకి బాలమ్మ వాపోయారు. తాగునీటి కోసం బాధితులు రాస్తారోకోలు చేస్తున్నారు. వరద వెలిసిపోయి మూడు రోజులు కావస్తున్నా వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో చాలా గ్రామాల్లో బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దాఖలాలే లేవు. 

దుర్వాసన వస్తున్న హెరిటేజ్‌ నీటి ప్యాకెట్లు
హెరిటేజ్‌ నీటి ప్యాకెట్లను బాధితులకు ఇచ్చారు. అయితే అవి తాగడానికి పనికిరాకుండా దుర్వాసన వస్తుండటంతో జనం వాటిని పడేశారు. ఇళ్లలోనూ, పొలాల్లోనూ బోర్లు, మోటార్లు ఉన్నప్పటికీ నాలుగు రోజులుగా కరెంటు సరఫరా లేకపోవడంతో నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. నీటి ట్యాంకర్‌ వస్తుందని చెప్పారని, ఇప్పటివరకు రాలేదని వివిధ గ్రామాల మహిళలు వాపోయారు. 

ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు
మా గ్రామానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. రోడ్డుపై పడిపోయిన చెట్లను గ్రామస్తుల సహకారంతో తొలగించాం. పారిశుధ్య పనులు కూడా గ్రామకమిటీనే చేయించింది. 500 గడపలున్న మా గ్రామంలో తోటలు, ఇళ్లు పడిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. 
– డొంక తిరుపతిరావు, మాజీ సర్పంచ్, పెద్దబైపల్లి, వజ్రపుకొత్తూరు మండలం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top