
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీగాల చంద్రమౌళి
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గం టీడీపీలో కొత్తగా ప్రవేశించిన చిత్తూరు రౌడీ రాజకీయంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, కొత్త నేత దిగుమతి అయ్యాక రౌడియిజం, గ్రూపు రాజకీయాలు, భూకబ్జాలను పెంచి పోషిస్తూన్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న నాయకులు తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రౌడీ రాజకీయాలను భరించలేక పార్టీని వీడుతున్నారు.
ఓటేరు అభివృద్ధిలో బీగాల మార్కు..
వేదాంతపురం పంచాయతీ ఓటేరు గ్రామ అభివృద్ధిలో బీగాల కుటుంబం పాత్ర కీలకం. బీగాల చంద్రమౌళి తల్లి బీగాల నాగమణి కాంగ్రెస్ మహిళా విభాగం తిరుపతి నగర అధ్యక్షురాలిగా పనిచేశారు. 1992లో కల్యాణిడ్యామ్ గేట్లు తెగి స్వర్ణముఖి వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను తీసుకువచ్చి ఓటేరు గ్రామంలో పట్టాలు ఇప్పించి ఇళ్లు నిర్మించటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. అంధకారంలో ఉన్న గ్రామంలో చంద్రమౌళి నాయకత్వంలో 24 గంటల పాటు కరెంట్ అందించటమే కాకుండా, తాగునీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించి దాహార్తిని తీర్చారు. అవిలాల, అగ్రహారం, పద్మావతీపురం, తిరుచానూరు పంచాయతీలకు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితిని తప్పించి, ఓటేరులోనే ప్రత్యేకంగా రేషన్ షాపును ఏర్పాటు చేయించారు. ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా గత ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రమౌళి వదిన శారద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.
వైఎస్సార్‌సీపీలోకి ‘బీగాల’ కుటుంబం....
ఓటేరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బీగాల చంద్రమౌళి ఈ రౌడీ రాజకీయం, గ్రూపు తగాదాలు, భూకబ్జాలపై ధ్వజమెత్తారు. కొత్తగా దిగుమతి అయిన నాయకులు టీడీపీని నాశనం చేస్తున్నారని పరోక్షంగా పులివర్తి నానిపై విమర్శల వర్షం కురిపించారు. నాని నాయకత్వంలో పనిచేయలేమని, పార్టీ సభ్యత్వంను సైతం వదులుకున్నానని ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అనుచరులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. అందరూ వైఎస్సార్‌సీపీలో చేరాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం ఉదయం 9గంటలకు ఓటేరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో జరిగే సభలో బీగాల చంద్రమౌళితో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.
జగనన్న నాయకత్వంపై నమ్మకంతోనే.....
నిత్యం ప్రజల కోసం వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకం, కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోరాటతత్వానికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు బీగాల చంద్రమౌళి తెలిపారు. శనివారం ఓటేరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెవిరెడ్డి నాయకత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి కోసం సైనికుల్లా పార్టీ పటిష్టతకు కృషి చేస్తామన్నారు.