పచ్చ గుట్టు.. పారదర్శకతతో రట్టు

TDP Activities Also Get Grama Sachivalayam Jobs In Guntur - Sakshi

పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఉద్యోగాలు

 అయినా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం

ఈ ఫొటోలో కనిపిస్తున్న టీడీపీ వీరాభిమాని పేరు యన్నం నాగరాజు. టీడీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు. వేమూరు గ్రామానికి చెందిన ఇతనికి ప్రతిభ ఆధారంగా సచివాలయంలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎల్లో మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. వీరంతా కేవలం ప్రతిభతోనే  జీవితాల్లో స్థిరపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఈ ఫలితాలు చెంపపెట్టుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారనే వారి కుటిల రాజకీయ బుద్ధిని తేటతెల్లం చేస్తున్నాయి.

సాక్షి, గుంటూరు: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల వ్యవధిలో 1.40 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం చూసి టీడీపీ, ఎల్లో మీడియాకు కన్ను కుట్టింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకంపై విష ప్రచారానికి తెరలేపారు. పేపర్‌ లీక్‌ అయిందని, ఉద్యోగాలన్నీ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకే ఇచ్చారని, నియామక ప్రక్రియ సరిగా జరగలేదని రోజుకో రీతిలో దుష్ప్రచారం చేశారు.  సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్‌ నుంచి అభ్యర్థుల ఎంపిక, నియామక పత్రాల అందజేత ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలూ, అక్రమాలూ జరగకుండా ఓ మహాయజ్ఞంలా సాగింది. తమ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండడంతో ఎందరో తల్లిదండ్రుల కల నెరవేరింది. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రతిభ కనబరిచిన వారికే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు సాధించిన వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీతో అంటకాగి నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా రిపోర్టర్లు, వారి కుటుంబ సభ్యులు సైతం సచివాలయ ఉద్యోగాలు సాధించారు. 


‘‘నా పేరు ఉప్పు మణికంఠ. ఫిరంగిపురం మండలం నుదురుపాడు మా స్వగ్రామం. టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలోనే ఉంది.  సచివాలయాల ఉద్యోగాల్లో నేను సర్వేయర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 ఉద్యోగం సాధించాను. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వచ్చింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయక ఇబ్బంది పడ్డాను. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా పారదర్శకతతో పూర్తిచేసింది. ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.’’ 

ఇది ఉప్పు మణికంఠ ఒక్కరి అభిప్రాయమే కాదు. ఉద్యోగాలు సాధించిన ఎంతో మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్‌ నుంచి ఉద్యోగ నియామకపత్రాల జారీ వరకు ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది. ప్రతిభ చూపిన వారికే ఉద్యోగాలు ఇచ్చి, వారికి పట్టంగట్టింది.  టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఉద్యోగాలు సాధించారు. దీంతో ప్రభుత్వంపై  ప్రశంసల వర్షం కురిసింది. దీనిని తట్టుకోలేని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా అక్కసుతో ఉద్యోగాల భర్తీపై దుష్ప్రచారానికి దిగింది. టీడీపీ, ఎల్లో మీడియా తీరుపై  ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.   

 నిదర్శనాలు ఇవిగో..     
► వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన బండ్ల శశిరేఖ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించింది. ఈమె తండ్రి వెంకటకోటయ్య ఇనిమెళ్ల  గ్రామ టీడీపీ నాయకుడు. ఇదే తరహాలో ఈపూరు మండలానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరుడు ఉన్నం భరత్‌ హార్టికల్చర్‌ అసిస్టెండ్‌ ఉద్యోగాన్ని సాధించాడు. 
పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు.
► తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన గాజులవర్తి సాంబశివరావు వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇతను స్వయంగా టీడీపీ కార్యకర్త. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో చురుగ్గా  పాల్గొన్నాడు.
► కొలకలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కొలకలూరి కేసరి కుమార్తె కొలకలూరి మాధవి వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా ఎంపికైంది.
► కొలకలూరు టీడీపీ కార్యకర్త ఉన్నం సాల్మన్‌ కుమారుడు ఉన్నం మోజెస్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించాడు. 
► కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త ఉప్పల అర్జునరావు కుమార్తె ఉప్పల శివనాగరాణి మహిళా పోలీస్‌ ఉద్యోగం సాధించింది.
► కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీల కార్యకర్త మున్నంగి శ్రీనివాసరావు కుమారుడు మున్నంగి వెంకటేశ్వరరావు జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుకు      ఎంపికయ్యాడు.
► మంగళగిరి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగాల ప్రక్రియపై విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా రిపోర్టర్‌ సోదరుడి భార్య చిరందాసు గాయత్రి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించింది. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన భర్త ఉపాధికి సాయం చేస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు జీవిత భరోసాను కల్పించారని గాయత్రి అంటోంది. 
► నరసరావుపేట నియోజకవర్గంలోని కర్లకుంటలో టీడీపీ నాయకుడు, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ లింగా వెంకటేశ్వర్లు సోదరుడి కుమార్తె అనిత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సాధించింది. వెంకటేశ్వర్లు బం«ధువులు లింగా సాంబయ్య వెటర్నరీ అసిస్టెంట్, ఇదే గ్రామంలో టీడీపీ కార్యకర్త మల్లయ్య కుమారుడు  వెంకటరావు వెటర్నరీ అసిస్టెంట్, మరో కార్యకర్త బత్తుల హనుమయ్య కుమారుడు బత్తుల చిరంజీవి సర్వేయర్‌ ఉద్యోగానికి     ఎంపికయ్యారు.

తెలుగుదేశం పార్టీ కర్లపాలెం మండల కన్వీనర్‌ నక్కల వెంకటస్వామి సోదరుడు నర్రవారిపాలెం గ్రామ టీడీపీ కన్వీనర్‌ నక్కల శేషాద్రి కుమారుడు గోపి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, అందుకే తనకు ఉద్యోగం వచ్చిందని గోపి చెబుతున్నాడు.

దుగ్గిరాల మండలం కొండూరు గ్రామానికి చెందిన రామకోటయ్య మొదటి నుంచీ టీడీపీ సానుభూతిపరుడు. సచివాలయ పరీక్షల్లో వార్డ్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ ఉద్యోగం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తనకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగమిచ్చారని ఆయన సంబర పడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top