
దొంగతనం ముసుగులో మహిళ హత్య!
ఎస్.కోటలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళపై ముగ్గురు దుండగులు దాడి చేసి దోపిడికి పాల్పడి ఒక మహిళను హత్య చేశారు.
ఎస్.కోట (విజయనగరం): ఎస్.కోటలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళపై ముగ్గురు దుండగులు దాడి చేసి దోపిడికి పాల్పడి ఒక మహిళను హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా ఎస్. కోట మండలంలోని రైల్వే ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో జరిగింది. వివరాలు.. స్వాతి(టెక్నిషియన్(25)), పార్వతి(హెల్పర్)లు సోమవారం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతలో ముగ్గురు నిందితులు వారిపై దాడి చేశారు. ముందుగా పార్వతి ముఖానికి ముసుగువేసి బంధించారు. అనంతరం స్వాతిని పట్టుకొని ముఖంపై బలమైన వస్తువుతో మోదారు. దీంతో స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది.
అంతేకాకుండా పార్వతి వద్ద ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం సహాయంతో పరిశీలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు అయితే, ఇద్దరి మహిళల్లో ఒక్కరినే ఎందుకు చంపుతారన్నది అర్థంకాని ప్రశ్న? ఇది దొంగతనం ముసుగులో కావాలనే చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు.