విద్యార్థుల వేదన.. అరణ్య రోదన | Students Protest For New College | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వేదన.. అరణ్య రోదన

Apr 5 2018 12:39 PM | Updated on Apr 5 2018 12:39 PM

Students Protest For New College - Sakshi

డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

రాయవరం (మండపేట):గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఆ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. చిట్టడవిని తలపించే ఆ ప్రాంతంలో, నిత్యం భయపెడుతున్న విష
సర్పాల మధ్య చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే కళాశాల భవనం కూడా అధ్వానంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలి యని పరిస్థితి నెలకొంది. కళాశాలను గ్రామంలోకి మార్చాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనలు కూడా చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన రాయవరంలో 1983లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనే కళాశాల ఉండడంతో మొదట్లో షిప్టుల పద్ధతిలో నిర్వహించారు. అప్పట్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా ఉండేవి. 2001లో ప్రభుత్వం జూనియర్‌ కళాశాల భవనాన్ని మంజూరు చేయగా, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పంటపొలాల మధ్య నిర్మించారు. 2002లో ప్రారంభించిన కళాశాల భవనం రెండేళ్లకే నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. భవనం కిటికీల అద్దాలు వాటికవే ఊడి ఫ్లోరింగ్‌ దిగడం, శ్లాబు జాయింట్ల మద్య పగుళ్లు ఏర్పడి వర్షం వస్తే వర్షపు నీరంతా తరగతి గదులు, ఆఫీసు గదులలోనికి చేరుతుంది. ఫలితంగా తరగతుల నిర్వహణతో పాటు కార్యాలయ పనులకు ఆటంకం ఏర్పడుతోంది.

విష సర్పాల సంచారం
పొలాల మధ్య కళాశాల ఉండడంతో నిత్యం విష సర్పాలు సంచరిస్తున్నాయి. తరగతులు జరుగుతున్న సమయంలో గదుల్లోకి పాములు, తేళ్లు రావడంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేక పోతున్నామని  విద్యార్థులు వాపోతున్నారు. పలుమార్లు విషసర్పాలు, కీటకాలను తరగతి గదులలోనే చంపిన పరిస్థితిని తలచుకొని విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో బీటలు వారిన గోడల్లో పాములు, తేళ్లు ఆవాసాలుగా మార్చుకున్నాయి. అధ్యాపకులు చాక్‌పీస్‌తో పాటు కర్రలను కూడా గదుల్లో ఉంచుకోవాల్సినదుస్థితి నెలకొంది.

కళాశాల మార్పు కోసం నిరసనలు
జూనియర్‌ కళాశాలను గ్రామంలోకి మార్చాలంటూ గతేడాది విద్యార్థులు నిరసనలు, మానవహారాలు చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని పలువురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడి, కళాశాలను ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే కళాశాలను గ్రామంలోని ఉన్నత పాఠశాలలోకి మార్చాలంటే ఆషామాషీ కాదు. ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుందనే భావనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. శిథిల భవనంలో విద్యార్థులు, అధ్యాపకులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కళాశాల మార్పును చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇబ్బందులు వాస్తవమే
కళాశాలలో ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమే. విద్యార్థులు గతేడాది కళాశాల మార్పు కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు వచ్చి కళాశాలను పరిశీలించారు. కళాశాల మార్పుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.– జీజీకే నూకరాజు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాయవరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement