
హైదరాబాద్ అందరిదీ
‘‘హైదరాబాద్ నగరం తెలుగువారి అందరి ఆస్తి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. నగరం నుంచి వెళ్లిపోమనే అధికారం ఎవరికీ లేదు. రాష్ట్ర ఉద్యోగులందరికీ హైదరాబాద్‌లో ఉండే హక్కు కాదనలేనిది.
సాక్షి; హైదరాబాద్: ‘‘హైదరాబాద్ నగరం తెలుగువారి అందరి ఆస్తి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హైదరాబాద్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. నగరం నుంచి వెళ్లిపోమనే అధికారం ఎవరికీ లేదు. రాష్ట్ర ఉద్యోగులందరికీ హైదరాబాద్‌లో ఉండే హక్కు కాదనలేనిది. నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నినదించారు. రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రులకు హైదరాబాద్ నగరాన్ని దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. యూపీఏ తెలంగాణ ప్రకటన నిర్ణయానికి వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఫోరం బుధవారం కూడా ఆందోళన కొనసాగించింది. సచివాలయ ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం మొత్తం వెనక్కి నడిచి నిరసన వ్యక్తం చేశారు.
వేలాది మంది ఉద్యోగులు నడకలో పాల్గొనడంతో సచివాలయం మొత్తం భారీ మానవహారం ఏర్పడింది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని, ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఫోరం నేతలు తెలిపారు. సీమాం ధ్రుల సమస్యలు, సందేహాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తమ సమస్యలను వినిపించాలని నిర్ణయించారు. సమైక్యాంధ్రే ధ్యేయంగా ముందుకు సాగాలని తీర్మానించారు. ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.