టీడీపీ ఎమ్మెల్యే లలితకుమారికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న తహసీల్దార్ రమేష్
అధికారులకు ఎస్.కోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హుకుం
లక్కవరపుకోట : తాము చెప్పిందే అధికారులు చేయాలంటూ విజయనగరం జిల్లా ఎస్.కోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పార్టీ శ్రేణులతో కలిసి లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. కోర్టులో ఉన్నదైనా సరే తనకు తెలియకుండా తమపార్టీ నాయకుల భూమిని వివాదాస్పద భూమి జాబితాలోకి ఎందుకు మార్చారంటూ రెవెన్యూ సిబ్బందిపై ఊగిపోయారు.
లక్కవరపుకోట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 422–5లో 0.67 సెంట్లు, 422–6లో 0.70 సెంట్ల మెట్టభూమికి సంబంధించి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావుకు, ఎం.జయశ్రీకి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్ల వరకు పలుకుతుంది. ఈ భూమికి సంబంధించి ఈశ్వరరావు పేరుపై వన్‌బీ నమోదై ఉంది. ఈ విషయమై జయశ్రీ ఆర్డీవో కోర్టును ఆశ్రయించారు.
ఆర్డీవో ఆదేశాలతో దీనిపై విచారించిన తహసీల్దార్ గత డిసెంబర్ 12న ఆర్డీవోకి నివేదిక ఇచ్చారు. అదేనెల 15న జేసీ ఆ భూమిని వివాదాస్పద భూమి జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే లలితకుమారికి చెప్పారు. ఆమె టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్‌వేసి ధర్నాకు దిగారు. ఆ భూమిని వివాదాస్పద భూముల జాబితా నుంచి తొలగించేవరకు ధర్నా విరమించేది లేదని చెప్పారు.
ప్రస్తుతం అదనపు బాధ్యత వహిస్తున్న తహసీల్దార్ టి.రమేష్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మీరు మాకు చెప్పకుండా పనులు చేసేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ భూమి వివాదం కోర్టులో ఉండటంతో జేసీ డిస్పూ్యట్ భూముల జాబితాలో చేర్చారని తహసీల్దార్ చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు.


