చెన్నకేశవునికి శఠగోపం! | Sathagopam cennakesavuniki! | Sakshi
Sakshi News home page

చెన్నకేశవునికి శఠగోపం!

Nov 19 2014 2:10 AM | Updated on Aug 10 2018 9:42 PM

చెన్నకేశవునికి శఠగోపం! - Sakshi

చెన్నకేశవునికి శఠగోపం!

: పోరుమామిళ్ల సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. అక్కడి చెన్నకేశవుడికి సుమారు 50 ఎకరాలకు పైగా భూములున్నాయి.

జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. దేవుళ్లకు సైతం శఠగోపం పెట్టేందుకు వెనుకాడటం లేదు. రూ.4కోట్లు విలువజేసే చెన్నకేశవస్వామి ఆలయ భూములను స్వాహా చేసి రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టారు. నియంత్రించాల్సిన అధికారులు పచ్చచొక్కా నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కడప: పోరుమామిళ్ల సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. అక్కడి చెన్నకేశవుడికి సుమారు 50 ఎకరాలకు పైగా భూములున్నాయి. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఈ దేవస్థానానికి గత కొంతకాలంగా పాలకవర్గ నియామకాలు చేపట్టలేదు. కౌలు చెల్లిస్తూ పలువురు గ్రామస్తులు దేవస్థాన భూములు సాగు చేసుకునేవారు. దేవాదాయశాఖ పట్టించుకోకపోవడంతో కౌలుదారులే భూముల హక్కుదారులుగా మారారు.

దాంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రంగసముద్రం గ్రామ పొలం సర్వే నంబర్ 171లో 2.76 ఎకరాలు చెన్నకేశవస్వామికి మాన్యం ఉంది. పోరుమామిళ్ల విస్తరించడంతో ప్రస్తుతం ఆ భూమికి బాగా డిమాండ్ ఏర్పడింది. విడిగా విక్రయిస్తే ప్రధాన రోడ్డుకు అందుబాటులో సెంటు రూ. 4లక్షలు పలుకుతోంది. ఆ మొత్తం భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

 కౌలుదారులే హక్కుదారులుగా....
 పోరుమామిళ్ల చెన్నకేశవస్వామి భూమికి కౌలుదారులే హక్కుదారులుగా వ్యవహరిస్తున్నారు. కమ్మవారిపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పక్కాగా దేవుని సొమ్మును సొంతం చేసుకుంటున్నారు. దేవాదాయశాఖ పరిధిలోని భూములపై వ్యాజ్యం వేస్తూ వారిని ప్రతివాదులుగా చేర్చకుండా రెవెన్యూ వారిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ మేరకు హైకోర్టు దేవాదాయశాఖ భూమి కాకుంటే రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు సృష్టించవద్దని డబ్ల్యుపీ 30526/12 తేదీ 2012 డిసెంబర్ 31న తీర్పు చెప్పింది. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులు సర్వే నంబర్ 171లోని భూమి దేవాదాయశాఖ భూమిగా రూఢీ చేస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం ఎండోమెంటు భూమిగా నమోదైంది. అయినప్పటికీ చెన్నకేశవస్వామి భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రూ.4కోట్ల విలువైన భూమిని పరులపాలు చేస్తున్నారు.

 చేతులు మారిన పచ్చనోట్లు ..
 పచ్చచొక్కానేతలకు అడ్డులేకుండా ఉండేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు దేవాదాయశాఖ, రిజిస్ట్రేషన్ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన భూములు పరులపాలవుతున్నా దేవాదాయశాఖ కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తోంది. అందుకు కారణం ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరికి అర ఎకరా భూమి అప్పగించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ఆ మేరకే ఈ వ్యవహారం బహిర్గతం కాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఓ సబ్ రిజిస్ట్రార్‌కు పెద్ద ఎత్తున ముడుపులు అందించినట్లు కూడా వినికిడి. దాంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి ఆటంకం లేకుండా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. కాగా ఈ
విషయమై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్‌ను వివరణ కోరగా తనకు ఆ విషయం ఏమాత్రం తెలియదని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement