అలుపెరుగని పోరాటం | Relentless struggle | Sakshi
Sakshi News home page

అలుపెరుగని పోరాటం

Sep 15 2013 3:03 AM | Updated on May 24 2018 1:51 PM

సమైక్య రాష్ట్ర పరిరక్షణకు జిల్లా ప్రజలు కంకణబద్ధులయ్యారు. 46 రోజులు దాటినా అలుపెరుగని పోరు కొనసాగుతుంది. కర్నూలు నగరంలో నిరసనలు హోరెత్తుతున్నాయి.

కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణకు జిల్లా ప్రజలు కంకణబద్ధులయ్యారు. 46 రోజులు దాటినా అలుపెరుగని పోరు కొనసాగుతుంది. కర్నూలు నగరంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని కలెక్టేట్ నుంచి రాజ్‌విహార్ వరకు మౌన ప్రదర్శన చేపట్టారు. సాయి వసంత్ విహార్ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల చెక్‌పోస్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. విద్యు త్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బ్యాంకులను ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఈఓఆర్‌డీలతో జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సదస్సు ఏర్పాటైంది. ఈ నెల 16న అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రత్యేక తీర్మానం చేయించి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లకు ప్రతులను నిర్ణయించారు. ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు ఎస్‌ఈ కార్యాలయం నుంచి రాజ్‌విహార్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు, వైద్యులు కళాశాల నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. కోడుమూరులో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఆదోనిలో మహిళా గర్జన విజయవంతమైంది. విద్యుత్‌శాఖ జేఏసీ ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీస్, ఎల్‌ఐసీ కార్యాలయాలు మూయించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల మాస్క్‌లు ధరించి ఉపాద్యాయులు సోనియా భజన చేస్తూ నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. చాగలమర్రిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. నంద్యాలలో ఉద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను మూయించారు. ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా జనఘోష కార్యక్రమం నిర్వహించారు. వెల్దుర్తిలో హెల్పింగ్ హ్యాండ్స్, జేఏసీ ఆధ్వర్యంలో 200 అడుగుల జాతీయ పతాకంతో భారీ ప్రదర్శన ఆకట్టుకుంది.
 
  పత్తికొండలో మహిళలు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి శివ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement