గుంటూరులో రియల్ బూమ్ | Real boom in Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో రియల్ బూమ్

May 19 2014 12:23 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత నాలుగేళ్లుగా అనేకమంది

సాక్షి, గుంటూరు :గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత నాలుగేళ్లుగా అనేకమంది భూములను అమ్మేందుకు ఎదురుచూపులు చూశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి నూతన రాజధానిగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం అనుకూలంగా ఉందంటూ ఊహాగానాలు రావడంతో గుంటూరుకు చుట్టుపక్కల 30 కి.మీ వరకూ భూముల ధరలు రోజురోజుకూ పైపైకి వెళ్తున్నాయి. దీనికితోడు ఇటీవల రాజధాని ఏర్పాటు గురించి సీమాంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలు తిరిగిన కేంద్ర బృందం వారం రోజుల క్రితం గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బృందం జిల్లాలో గుంటూరు- విజయవాడ మధ్యే పరిశీలన జరపడంతో ఇక ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో గుంటూరు నగర శివారుల్లో సైతం భూములను అమ్మేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు. ధరలు పెరుగుతున్నాయి కదా.. ఒక నెల చూద్దాంలే అంటూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. బడా వ్యాపారవేత్తలు మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్ ధరల కంటే అనూహ్యంగా ధరలు పెంచి అడుగుతుండటం తో కొందరు వచ్చిన వరకూ చాల్లే అంటూ అమ్మేస్తున్నారు.
 
 శివారు ప్రాంతాలపై రియల్టర్ల దృష్టి
 దీనికితోడు గుంటూరు నగర శివారులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నూతన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంగళగిరి వద్ద పోలీస్ బెటాలియన్ ఉన్న ప్రాంతంలో సీమాంధ్ర డీజీపీ కార్యాలయం ఏర్పాటు అవుతుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో భూ యజమానుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే భూముల ధరలు పెరుగుతున్నాయంటూ అందరికీ తెలిసిపోవడంతో అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రియల్టర్ల దృష్టి నగర శివారు ప్రాంతాలపై పడింది.
 
 పల్నాడును ప్రత్యేక జిల్లా చేస్తామంటూ ప్రకటనలు..
 గుంటూరు సంగతి అలా ఉంచితే నరసరావుపేటతోపాటు పల్నాడు ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేస్తామంటూ ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో సైతం భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మాచర్ల నుంచి దుర్గి, బొల్లాపల్లి ప్రాంతాల్లో అటవీభూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం భావిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్కనే కృష్ణానది ఉండటంతో రాజధాని కేంద్రంలో నీటి సమస్య ఉండదని, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇక్కడే ఉన్నాయని, పైగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన మైనింగ్ భూములు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. దీంతో గతంలో ఎకరా లక్ష కూడా పలకని భూములు ఇప్పుడు నాలుగైదు రెట్లు అధికంగా పెరిగిపోయాయి. ఆ ధరకు కూడా అమ్మేందుకు ఎక్కువ శాతం మంది ముందుకు రావడంలేదు. రాజధాని అయినా కాకపోయినా, ప్రత్యేక జిల్లా అయితే చాలని కొందరు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 
 స్థల యజమానులు అప్రమత్తం...
 పెదకాకాని: సీమాంధ్ర రాజధాని ఏర్పాటు గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు జరుగుతుందని ప్రచారం ఊపందుకోవడంతో కొందరు స్థలాల యజమానులు అప్రమత్తమయ్యారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మండల పరిధిలోనే ఉండటంతో పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, వెనిగండ్ల అగతవరప్పాడు గ్రామాలలో ఎక్కువగా స్థలాలు కొన్న వారు తమ ప్లాట్లను చూసుకునేందుకు అధికసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొందరు తమ ప్లాటు గుర్తించగా మరి కొందరు తమ ప్లాటు ఎక్కడుందో తెలీడంలేదనీ, కాస్త వెతికి పెట్టాలని బ్రోకర్లను ఆశ్రయిసున్నారు. తక్కువ ధరకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రాంతాలలో ఉండటం వల్ల ప్లాటు కొని ఏళ్ల తరబడి తిరిగి చూడలేదు.
 
 ప్రస్తుతం కొన్ని ప్లాట్లు ముళ్ల కంచెలుగా మారగా మరికొని బ్రోకర్ల మాయాజాలం కారణంగా దొంగ  రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో తాము కొనుగోలు చేసినప్పుడు తూర్పు, పడమర రోడ్లు ఉన్నాయి కదా, ఇదేంటి మా పాట్లన్నీ ఉత్తరం, దక్షిణం రోడ్లుగా మారాయని తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్ర రాజధాని ప్రచారం జోరుగా సాగడంతో మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న ప్లాట్లను ఫెన్సింగ్ వేసుకోవడం, పిల్లర్స్ పోయడం, ప్రహరీ కట్టుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. స్థలాల ధరలు మాత్రం చుక్కలు చూస్తుండగా కొనుగోలు చేసే వారు ముందుకు రావడం లేదు. అవకతవకలు జరగకుండా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement