సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్సార్ పేరు తొలగింపుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ పేరును పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంబటి మురళీ కృష్ణను టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు అడ్డుకున్నారు. అంబటి మురళీకృష్ణ కారుపై దాడికి టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో టీఎన్‌ఎస్ ఎఫ్ నేతలు వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీ వీసీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా అధికారులు తలుపులు మూసేశారు.
ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు అనుసరిస్తున్న విధానాలు విద్యావేత్తలు, మేధావులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం నాడు వర్సిటీలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు.. నేడు ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న మహానేత పేరును తొలగించి వివాదాలకు తెరలేపారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలగ కొనసాగుతున్న పేరును మార్చాలని టీడీపీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు బుధవారం వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావును కోరారు. వారు కోరిన 24 గంటల్లోనే గురువారం క్రేన్‌ను రప్పించి ఇంజినీరింగ్ కళాశాలపై ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించడం వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కళాశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తొలగించడం దుర్మార్గ చర్య అని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాదవశాత్తు మరణించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేయాలనే నిర్ణయం 2009లో అప్పటి పాలకమండలి, అకడమిక్ సెనేట్ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, నేటి పాలకులు డాక్టర్ వైఎస్సార్ పేరు తొలగించటం బాధాకరమని వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు.


