రణరంగం
పెద్దవడుగూరు : పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామం బుధవారం రణరంగమైంది. దళితులు, దళితేతరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
పెద్దవడుగూరు : పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామం బుధవారం రణరంగమైంది. దళితులు, దళితేతరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాళ్లు, కట్టెలతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పది మందికి పైగా గాయపడ్డారు. అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులకూ తీవ్ర గాయాలయ్యాయి. మొహర్రం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి పానకాల దుత్తలను దళితులు పీర్లచావిడి వద్దకు తీసుకెళ్లేటప్పుడు హద్దులు దాటి వచ్చారనే నెపంతో కొందరు గ్రామస్తులు వివాదానికి దిగారు.
ఇది ఘర్షణకు దారి తీసింది. రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పీర్లు జలధికి కూడా వెళ్లలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దళితు లు డెయిరీకి పాలు పోయడానికి వెళ్లగా అక్కడ తీసుకోలేదు. కాలనీలోకే వచ్చి తీసుకుంటామని, ఊళ్లోకి రావద్దని నిర్వాహకులు చెప్పి పంపారు. దీంతో వారు వెనుదిరిగారు.
అదే సమయంలో కొందరు గ్రామస్తులు దళిత కాలనీ వైపు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా తమ కాలనీ వైపు రాకూడదంటూ దళితులు అడ్డుకున్నారు. దీంతో వివాదం పెద్దదైంది. పోలీసులున్నాలెక్కచేయకుండా ఇరువర్గాల వారు రాళ్లు, కట్టెలతో రెచ్చిపోయారు. గుత్తి సీఐ మోహన్, పెద్దవడుగూరు ఎస్‌ఐ ధరణిబాబు, యాడికి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు వారినీ లెక్కచేయకుండా రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు.
అయినా పోలీసులే అసలు గొడవకు కారణమంటూ వారిని కొట్టడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐలు ధరణిబాబు, రామకృష్ణారెడ్డితో పాటు జమేదార్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు మహేష్, సురేష్, నరసింహులు తదితరులు గాయపడ్డారు. అక్కడున్న పోలీసు జీపులను గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఇక్కడి పరిస్థితిని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫైరింగ్‌కు అనుమతి ఇవ్వడంతో గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు.
తర్వాత తాడిపత్రి డీఎస్పీ నాగరాజు అక్కడికిచేరుకొని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. చివరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పెషల్ పార్టీ పోలీసులతో వచ్చి ఘర్షణకు పాల్పడుతున్న వారిని చెల్లాచెదరు చేశారు. ఘటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపైనా గ్రామస్తులు దాడికి దిగారు.
కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు లాక్కొన్నారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీతో పాటు ఏఎస్‌పీ మాల్యాద్రి, ఆర్‌డీఓ హుసేన్‌సాహెబ్, తహశీల్దార్ విష్ణువర్దన్‌రెడ్డి, ఆరుగురు డీఎస్పీలు పరిశీలించారు. గ్రామంలో కర్ఫ్యూ విధించారు.


