
సాక్షి, అనంతపురం : తాను దేవుడిని కాదు.. సేవకుడిని మాత్రమేనని చెప్పుకొస్తున్న ప్రభోదానందస్వామి.. తాడిపత్రి ఆశ్రమంపై జేసీ బ్రదర్స్ కక్షగట్టారని, వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తాజాగా ప్రబోదానందస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంలేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ దేవున్ని కించపరచలేదన్నారు. తన ప్రసంగాలను కట్‌చేసి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమాన్ని కబ్జా చేసేందుకు జేసీ దివాకర్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు.