విధిరాత.. మృత్యుగీత | person died in fire accident | Sakshi
Sakshi News home page

విధిరాత.. మృత్యుగీత

Feb 15 2014 2:43 AM | Updated on Sep 2 2017 3:42 AM

పని మీద బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు.

పని మీద బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కాళ్లు, చేతులు కడుక్కుని భోజనం చేసేందుకు కూర్చున్నాడు. తల్లి వడ్డిస్తుండగా బయటి నుంచి ఏవో కేకలు వినిపించాయి. రోడ్డు మీద చొప్ప ట్రాక్టర్‌కు మంటలు అంటుకున్నాయని తెలుసుకుని తినే పళ్లాన్ని పక్కన పెట్టి నీటి బిందె తీసుకుని వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు పశుగ్రాసం తీసుకెళ్తున్న యువకుడు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.   
 - న్యూస్‌లైన్, సంజామల
 
 ఆల్వకొండ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట చెందిన మంగలి రామాంజనేయులు (21) అతని పెద్దనాన్న పశువులకు అవసరమైన జొన్న చొప్పను కొనుగోలు చేసేందుకు ఉదయం ముగ్గురు కూలీలతో ట్రాక్టర్‌లో సంజామల మండలం ఆల్వకొండకు చేరుకున్నాడు. ట్రాలీలో చొప్ప నింపుకొని తిరిగి వెళ్తుండగా ఎస్సీ కాలనీ సమీపంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి.
 
 టాలీపై కూర్చున్న రామాంజనేయులు, కూలీలు గమనించి కిందకు దూకారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో కేకలు వేశారు. ప్రమాద స్థలానికి పక్కనే ఉన్న ఇంట్లో భోజనం చేస్తున్న తోక శ్రీనివాసులు (25)  కేకలు విని తినే భోజనం పక్కన పెట్టి మంటలు ఆర్పేందుకు నీటి బిందెను తీసుకెళ్లాడు. అతనితో పాటు కాలనీ వాసులు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ట్రాక్టర్ తగులబడి పోతుందని భావించిన డ్రైవర్ చొప్పకు కట్టిన తాళ్లను కత్తితో కోసి ట్రాలీ లిఫ్ట్‌ను ఎత్తాడు.
 
 వెనుక నుంచి మంటలు ఆర్పుతున్న శ్రీనివాసులు, రామాంజనేయులుపై తగులబడుతున్న చొప్ప పడి ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు మంటలు ఆర్పేసేలోగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సర్కిల్ ఇన్‌చార్జి ఎస్‌ఐ పులిశే ఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
 
 ఆధారం కోల్పోయిన కుటుంబాలు
 ఆల్వకొండ గ్రామానికి చెందిన మార్తెమ్మ, దేవదాసు దంపతులకు ఓ కుమారుడు. ముగ్గురు కుమార్తెలు. కుమారుడు శ్రీనివాసులుకు వివాహం కాగా భార్య విడిపోయింది. ఈ క్రమంలో శ్రీనివాసులు గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. సాయం చేయడానికి వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తిమ్మనాయుని పేటకు చెందిన చౌడప్ప, వీరమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కాగా, చిన్న కుమారుడు రామాంజనేయులు ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో మృతి చెందడంతో సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.  
 రోదిస్తున్న మృతుడు శ్రీనివాసులు తల్లిదండ్రులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement