ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్‌!

One More Opportunity For SC And ST Students For Preparing Village Secretariat - Sakshi

సాక్షి, ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్‌ లభించింది. కటాఫ్‌ 5 మార్కులు తగ్గించడంతో వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియలో రోస్టర్‌ పాయింట్ల విడదీత పొరపాట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరిలో మార్కులు సాధించినా రిజర్వేషన్‌ కేటగిరిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. దీనిపై అర్హత కలిగిన అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్సీ, ఎస్టీల్లో ఓపెన్‌ కేటగిరిలో మార్కులు సాధించిన అబ్యర్థులను ఓపెన్‌ కేటగిరిలో చేర్చారు. దీంతో రిజర్వేషన్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. సర్టిఫికెట్ల పరిశీలన చివరిరోజు సుమారు 40 మంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించారు. అంతేగాకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని వారిని కూడా తొలగించి ఆ తర్వాత మార్కులు వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ తెలిపారు.

ఈ మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మరోసారి భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వం కటాఫ్‌ మార్కులను తగ్గించి అన్ని కేటగిరిల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్న అభ్యర్థులకు సంబంధించి వెయిటేజ్‌ మార్కుల పరిశీలన అనంతరం తగ్గించిన కటాఫ్‌ మార్కులతో మెరిట్‌ జాబితా జిల్లా కలెక్టర్‌కు చేరింది. ఆ మేరకు ఉద్యోగ నియామకాలపై కసరత్తు ప్రారంభించారు. రెండో విడతలో మరో వెయ్యిమందికి పైగా ఉద్యోగాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు 5,500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top