హైదరాబాద్‌పై రాజీలేదు : కోదండరాం | No compermise on hyderabad, says kodandram | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై రాజీలేదు : కోదండరాం

Aug 8 2013 1:57 AM | Updated on Apr 7 2019 3:47 PM

హైదరాబాద్‌పై రాజీలేదు : కోదండరాం - Sakshi

హైదరాబాద్‌పై రాజీలేదు : కోదండరాం

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల ఏర్పాటే లక్ష్యమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జేఏసీ విస్తృతస్థాయి సమావేశం కోదండరాం అధ్యక్షతన జరిగింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల ఏర్పాటే లక్ష్యమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జేఏసీ విస్తృతస్థాయి సమావేశం కోదండరాం అధ్యక్షతన జరిగింది. సమావేశ విశేషాలను కోదండరాం జేఏసీ నేతలతో కలిసి మీడియాకు వివరించారు. తెలంగాణలో అంతర్భాగమైనా హైదరాబాద్‌పై కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు మౌనంగా ఉండటం సరికాదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి ఇంకా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కావాలని రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని కోదండరాం విమర్శించారు.
 
 ఈ కుట్రలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడ వెనుక ఉండి సమైక్యాంద్ర ఉద్యమానికి ఊతమిస్తున్నాడని విమర్శించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డీజీపీ హోదాలో దినేశ్ రెడ్డి ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని విమర్శించారు. డీజీపీని మార్చాలని, ఇతర రాష్ట్రాల కేడర్‌కు చెందిన వారిని డీజీపీగా నియమించాలని కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరారు. సీమాంధ్ర నాయకుల కుట్రలను తిప్పి కొట్టడానికి మరోసారి ఏకం కావాలని కోరారు. సీమాంధ్ర కుట్రలను ఎదుర్కోవడానికి, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కొనసాగించే దిశగా కార్యాచరణకు దిగుతామని చెప్పారు.
 
 ఈ నెల 10 నుంచి శాంతి, సద్భావన ర్యాలీలను నిర్వహించాలని, 12న ఉద్యోగ జేఏసీ నిర్ణయించిన కార్యక్రమాలలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలను కరపత్రాల రూపంలో పంపిణి చేయాలని సూచించారు. వీటికి సమాంతరంగా హైదరాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. మీడియా నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎన్‌టీవిని తెలంగాణ ప్రజలు చూడొద్దని, ఆ టీవి కార్యక్రమాల చర్చల్లో తెలంగాణ నాయకులు పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. సమావేశంలో బి. వినోద్‌కుమార్, డాక్టర్ దాసోజు శ్రవణ్ (టీఆర్‌ఎస్), బి. అశోక్‌కుమార్ యాదవ్, ఎన్.వేణుగోపాల్ రెడ్డి(బీజేపీ), పి. సూర్యం, కె.గోవర్థన్, పి.సంధ్య (న్యూ డెమోక్రసీ), జేఏసీ అగ్రనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, మణిపాల్ రెడ్డి, వెంకటేశం, రసమయి బాలకిషన్, పిట్టల రవీందర్, బాలనర్సయ్య, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement