నవరత్నాలు...పేదల అభివృద్ధికి బాసట

Navarathnalu Campaign In Kurnool - Sakshi

పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  

కర్నూలు, ప్యాపిలి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు అన్ని సామాజికవర్గాల అభివృద్ధికి బాసటగా నిలుస్తాయని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.  మండల పరిధిలోని బావిపల్లి గ్రామంలో గురువారం ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  అడుగడుగునా పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.  గ్రామంలో ఇంటింటికీ తిరిగిన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.    నవరత్నాలు పథకాల ప్రయోజనాలను వివరించారు.  ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ‘నవరత్నాలు’ రూపొందిచామని,   జగనన్న అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.  వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి రూ. 12,500 చొప్పున పెట్టుబడికి  అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడంతో పాటు ఉచితంగా బోర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.   విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తామన్నారు.  వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పారు.   ప్రస్తుతం ఉన్న పింఛన్‌ వయసును 45 సంవత్సరాలకు తగ్గించి పింఛన్‌ రూ. 2 వేలు, వికలత్వ పింఛన్‌ రూ. 3 వేలు అందజేస్తామన్నారు.  అదేవిధంగా పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, అమ్మ ఒడి తదితర పథకాలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. 

సీఎం చంద్రబాబులా మాయ మాటలు చేతకావు...  
సీఎం చంద్రబాబులా మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చేతకాదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.  జగన్‌  చెప్పింది చేస్తారని.... చేసేదే చెబుతారని స్పష్టం చేశారు.  అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీఎం ఏ ఒక్క హామీని పక్కాగా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని,  కొద్ది నెలలు ఓపికపడితే రాజన్న రాజ్యం వస్తుందని ఈ సందర్భంగా బుగ్గన భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో ప్యాపిలి, డోన్‌ జెడ్పీటీసీ సభ్యులు దిలీప్‌ చక్రవర్తి, శ్రీరాములు, సీనియర్‌ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, సప్తశైల  వెంకటేశ్,   మండల కన్వీనర్‌ రాజా నారాయణమూర్తి, సింగిల్‌ విండో అధ్యక్షులు సీమ సుధాకర్‌ రెడ్డి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు గడ్డం భువనేశ్వర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ గోపాల్‌ రెడ్డి, వి. శ్రీనివాసరెడ్డి, బషీర్, చంద్రశేఖర్‌రెడ్డి,  గ్రామ నాయకులు నాగిశెట్టి,  ఎల్లయ్య, గోపాల్, మల్లికార్జున, గోవిందు, సోమశేఖర్, నాగరాజు, శ్రీనివాసులు, సతీష్, తిమ్మప్ప, తెలుగు మోహన్, రామాంజి, యాగంటి, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top