తుళ్లూరు తుళ్లింత | Naidu likely to visit Thullur | Sakshi
Sakshi News home page

తుళ్లూరు తుళ్లింత

Jan 2 2015 3:22 AM | Updated on Oct 17 2018 4:29 PM

తుళ్లూరు తుళ్లింత - Sakshi

తుళ్లూరు తుళ్లింత

నూతన రాజధాని గ్రామం తుళ్లూరు తుళ్లింతకు లోనైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమై నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.

సాదర స్వాగతం పలికి సత్కరించిన తెలుగుదేశం పార్టీ నేతలు, గ్రామస్తులు
రాజధానికి భూములిచ్చిన రైతులను అభివృద్ధి పథంలో నడిపిస్తానని సీఎం స్పష్టీకరణ
జిల్లా ఉన్నతాధికారులకు ప్రశంసలు
కేకు తినిపించి దుశ్శాలువాలతో సన్మానం

 గుంటూరు సిటీ : నూతన రాజధాని గ్రామం తుళ్లూరు తుళ్లింతకు లోనైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో మమేకమై నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం ఆగ్రామానికి విచ్చేసిన సీఎంకు తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికి ఘన సత్కారం చేశారు. చంద్రబాబు బెలూన్లను గాలిలోకి వదిలి నూతన సంవత్సర వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కేక్ కట్ చేసి వేదికపై  ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి ఆప్యాయంగా తినిపించారు.

తుళ్లూరు గ్రామ సర్పంచ్ ఇందుర్తి నరసింహరావు, ఎంపీపీ పద్మలత, జెడ్పీటీసీ నాగేంద్రబాబులు సీఎంను సన్మానించారు. రాజధాని ప్రాంత రైతులు ముఖ్య మంత్రికి వెండి కిరీటాన్ని బహూకరించారు.
  ఈ సందర్భంగా రాజధాని ప్రాంత ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, మనమందరం రాజధాని వాసులమయ్యాం. ఇప్పటి నుండే తుళ్లూరులో నివాసం ఉండే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతానికి భూములను త్యాగం చేసిన మీ అభిమానాన్ని జీవితంలో ఎన్నటికీ మరువనని పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా మిమ్మల్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. తన మాటలు నమ్మాలని కోరారు.
 
మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకలను ఇక్కడ జరుపుకోవడం తన భాగ్యమన్నారు. వారంలో రెండు సార్లు ఇక్కడే ఉండి రైతుల తరఫున బాధ్యత తీసుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు.
* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, అన్నదాతల ఆత్మబంధువు, పేదల పెద్ద కొడుకుగా అందరి కష్టాలలో ముఖ్యమంత్రి పాలుపంచుకుంటున్నారన్నారు.
* మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ, నవ్యాంధ్ర నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్నారని, అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందే రాజధానిని నిర్మిస్తారని, ఇకపై మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారనుందన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు.
* నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మాట ప్రకారం విజయవాడ పరిసర ప్రాంతాలలో ఒక ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్న చంద్రబాబునాయుడుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
* చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, గత ఏడాది చేదు జ్ఞాపకా లు మిగిలాయనీ, ఇప్పుడు ఓతీపి గుర్తుతో ముందుకు సాగుతున్నామన్నారు.
* ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, క్రిస్మస్, జనవరి పండుగలకు  సీఎం ఇక్కడే గడపడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రపంచంలో మంచి నగరాలను చూసి వరల్డ్ బెస్ట్ సిటీని ఇక్కడ కట్టాలని చూస్తున్నట్లు చెప్పారు.
* కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, అనగాని సత్యప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, దూళిపాళ్ల నరేంద్రకుమార్, జీవీ ఆంజనేయులుతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.
* అధికారులకు సీఎం  ప్రత్యేక అభినందనలు
* తాను అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఇతోధికంగా కృషిచేస్తున్న అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా సత్కరించారు. లాండ్ పూలింగ్ సవ్యంగా సాగేందుకు కష్టపడుతున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవో భాస్కర్‌నాయుడు, తుళ్లూరు తహశీల్దార్ సుధీర్‌బాబులను శాలువాలతో ప్రత్యేకంగా అభినందించారు.
* ముఖ్యంగా జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌తో పాటు ఆర్డీవో భాస్కర్‌నాయుడుకు స్వయంగా తన చేతులతో కేక్ తినిపించి ప్రశంసించారు.
* సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను డైనమిక్ ఆఫీసర్‌గా అభివర్ణించారు.  ఏరికోరి సమర్థ అధికారులతో మంచి టీమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ టీమ్ నేతృత్వంలో అత్యుత్తమ రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు.
 
సీఎంకు ఘన స్వాగతం
తాడికొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు గురువారం తుళ్లూరులో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12.15 గంటలకు తుళ్లూరు చేరుకున్న సీఎంకు టీడీపీ నేతలు, అధికారులు ఎదురేగి స్వాగతం పలికారు. చైతన్యరథంపై గ్రామంలో రోడ్‌షో నిర్వహించడంతో దారిపొడవునా మహిళలు హారతులు పట్టారు. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, దూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాల పాటి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, పార్టీ అధికార ప్రతినిధి మన్నవ సుబ్బారావు తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement